మెడికో ప్రీతి మృతి..వెల్లువెత్తిన నిరసనలు

మెడికో ప్రీతి మృతి..వెల్లువెత్తిన నిరసనలు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : మెడికో విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసన సెగలు వెల్లువెత్తాయి. మెడికో ప్రీతి బలవన్మరణానికి కారణమైన సైకో సైఫ్ ని, హెచ్ఓడీని, కాలేజీ ప్రిన్సిపల్ ని కఠినంగా శిక్షించాలంటూ ఆదివారం రాత్రి నుంచే పలువురు ఆందోళన బాట పట్టారు. నిందితులకు శిక్ష వేసి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఆదివారం రాత్రి నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గిర్నితండా గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో ప్రీతి బంధువులు, గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. వారి రాస్తారోకోతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిందితుడు సైఫ్ ను వెంటనే ఉరి తీయాలని , బాధ్యులైన ప్రిన్సిపల్ , అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

మెడికో ప్రీతి కుటుంబానికి న్యాయం చేసి, నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలంటూ వరంగల్ ఎంజీఎం జంక్షన్ వద్ద సోమవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు నలుగంటి రత్నమాల ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ర్యాగింగ్ పేరుతో ఆడపిల్లలను బలితీసుకుంటున్న వారికి వెంటనే ఉరిశిక్ష వేయాలంటూ వారు నినదించారు.మెడికో ప్రీతి మృతి..వెల్లువెత్తిన నిరసనలుమెడికో విద్యార్థిని ప్రీతి కుటుంబానికి న్యాయం చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వరంగల్ ఎంజీఎం కూడలిలో బీజేపీ నాయకులు ధర్నా చేశారు. అయితే ప్రీతి మృతితో నిరసన సెగలు పుడతాయన్న భయంతో ముందస్తుగానే కేఎంసీ, ఎంజీఎం పరిధిలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ క్రమంలో ఆందోళనలకు దిగిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ప్రీతి మృతికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ నాయకులు కేఎంసీని ముట్టడించేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగి, తోపులాటలయ్యాయి. అనంతరం బలవంతంగా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మెడికో ప్రీతి మృతికి నిరసనగా మహబూబాబాద్ పట్టణంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సెంటర్ లో గోర్ సేన ఆధ్వర్యంలో విద్యార్ధులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. నిందితుడు సైఫ్ ను ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు.