న‌ల్సార్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ‌ మంత్రి

న‌ల్సార్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ‌ మంత్రిహైదరాబాద్ : శాసన సభలో నల్సార్ చట్ట సవరణ బిల్లును న్యాయశాఖ‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. 1998 సంవత్సరం, తదనంతరం అవసరానికి అనుగుణంగా నల్సార్ చట్టంలో కొన్ని మార్పులు చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నామన్నారు.

ఈ చట్టంలోని సెక్షన్ 5A ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థానిక విద్యార్థులకు 20 శాతం సీట్లకు కోటాను కల్పిస్తున్నామ‌ని తెలిపారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బిసిలు, దివ్యాంగులు మరియు మహిళలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేసినందున, 1998 నల్సార్ చట్టంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేరును సాంకేతికంగా తెలంగాణ హైకోర్టుగా మార్చాల్సిన అవసరం ఉందని స‌భ‌కు తెలియ‌జేశారు.

సీఎం కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థానిక విద్యార్థులకు అధికంగా అదే విధంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారని తెలిపారు. స్థానిక విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న 20 శాతం కోటాను 25 శాతానికి పెంచడంతో పాటు మొత్తం సీట్లలో బీసీ/ ఓబీసీలకు రిజర్వేషన్ విధాన కోటా ప్రకారం వీరికి సీట్లు కేటాయించే విధంగా ఈ చట్టంలోని నిబంధనలు సవరించాలని కోరారు. ఈ చట్ట సవరణ వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థానిక విద్యార్థులకు మరియు బీసీ/ ఓబీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా సభను కోరారు. మంత్రి ప్రవేశ పెట్టిన ఈ బిల్లును శాసన సభ ఆమోదించింది.