ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారుహైదరాబాద్‌: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇవాళ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తరలించారు. కాగా చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. నెలరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స అనంతరం కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. 1956లో జన్మించిన నర్సింహయ్య ఎంపీపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. సీపీఎం తరఫున పోటీచేసి రెండుసార్లు నకిరేకల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నాగార్జునసాగర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై విజయం సాధించారు. నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు, తెలంగాణ మంత్రులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.