మోహన్ బాబుతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ

మోహన్ బాబుతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీవరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుతో శుక్రవారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. పరిశ్రమ సమస్యలపై పేర్ని నాని మోహన్ బాబుతో చర్చించారు.మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో గురువారం భేటీ అయింది. ఈ భేటీకి మోహన్ బాబు హాజరు కాలేదు. దీంతో మోహన్ బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ నెలాఖరులోపుగా సినీరంగ ప్రముఖులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం జీవోలు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ గురువారమే ప్రకటించారు. మా అసోసియేషన్ అధ్యక్షుడుగా మోహన్ బాబు తనయుడు విష్ణు ఇటీవల ఎన్నికయ్యారు. ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ కావడంపై మంచు విష్ణు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీ వ్యక్తిగతమైందిగా పేర్కొన్నారు.

అయితే నిన్న సీఎంతో జరిగిన సమావేశానికి చిరంజీవి సహా పలువురు నటులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందన్నారు. గత ఐదారు నెలలుగా ఉన్న గందరగోళానికి తెరపడిందని సినీ ప్రముఖులు ప్రకటించారు. సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడుతుందని తాను భావిస్తున్నానని చిరంజీవి నిన్ననే ప్రకటంచిన విషయం తెలిసిందే. చిన్న సినిమాలు 5వ షోకి కూడా ప్రభుత్వం అంగీకరించిందని చిరంజీవి చెప్పారు. ప్రజలు, సినీ పరిశ్రమ కూడా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతృప్తి చెందుతారని చిరంజీవి అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చిత పరిస్థితులకు శుభం కార్డు పడిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని చిరంజీవి ప్రకటించారు. చిన్న సినిమాలకు కూడా మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చర్చలకు మమ్మల్ని ఆహ్వానించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. పాన్ ఇండియా సినిమాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీఎం చెప్పారని చిరంజీవి వివరించారు.

సినీ పరిశ్రమ తరపున ప్రభుత్వంతో చర్చలను నిర్వహించిన చిరంజీవికి తొలుత ధన్యవాదాలు చెబుతున్నానని ప్రముఖ నటుడు మహేష్ బాబు చెప్పారు. ఈ చర్చలతో తమందరికీ ఓ దారి చూపారని మహేష్ బాబు తెలిపారు. ఆరేడు నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ గందరగోళంలో ఉందని చెప్పారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో సినీ పరిశ్రమకు పెద్ద రిలీఫ్ అని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు. చిరంజీవితో పాటు ఈ విషయమై ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని కూడా చొరవ చూపారని మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. వారం లేదా పదిరోజుల్లో అందరూ శుభవార్త వింటారని మహేష్ బాబు చెప్పారు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు నిర్మాతల సమస్యలను సీఎం జగన్ ఓపికగా విన్నారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెప్పారు. సినిమా పరిశ్రమ ఎలా ముందుుకు వెళ్లాలనే దానిపై సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారని రాజమౌళి చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలపై ఎటు వెళ్లాలనే దానిపై ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసినప్పటికీ చిరంజీవి ఈ అంశాన్ని తన భుజానికెత్తుకొని సక్సెస్ అయ్యేలా చేశారన్నారు.