ఓరుగల్లులో ఘనంగా జాతీయ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలు

ఓరుగల్లులో ఘనంగా జాతీయ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలుహనుమకొండ జిల్లా : హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 60వ జాతీయ అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివి. శ్రీనివాస్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లు వరంగల్ మేయర్ గుండు సుధారాణి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దీంతో ఓరుగల్లు అంతటా క్రీడా సంబరాలు అంబరాన్నంటాయి. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ ను వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహిస్తోంది.

హనుమకొండ బస్ స్టేషన్ సమీపంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ( జేఎన్ఎస్ గ్రౌండ్ )లో బుధవారం ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ ఈ నెల 19 వరకు జరుగనుంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆల్ ఇండియా పోలీస్ , రైల్వేస్, ఎల్ ఐసీ వంటి యూనిట్లతో పాటు 21 రాష్ట్రాల నుంచి 519 మంది అథ్లెట్లు వచ్చారు. ఈ పోటీల్లో 23 రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. సీఎం కేసీఆర్ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ జేఎన్ఎస్ లో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి సహకరించారని చీఫ్ విప్ తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి మరెన్నో జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అన్ని క్రీడలకి నిలయంగా హనుమకొండలోని జెఎన్ఎస్ స్టేడియం వేదిక కాబోతుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు, క్రీడాకారులకు, కోచ్ లను ప్రోత్సహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు.

తెలంగాణ రాస్ట్రం నుంచి 17 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఆయన చెప్పారు. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మన రాష్ట్రంలో నిర్వహించడం హర్షనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పోటీలకు వరంగల్ నగరంలో మంచి ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కేసీఆర్ పర్యాటకంగా, క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. వీటితో పాటు క్రీడల అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.ఓరుగల్లులో ఘనంగా జాతీయ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలుఓరుగల్లు వైభవాన్ని చాటిచెప్పేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈవెంట్ కు ప్లానింగ్, కో ఆర్డినేషన్ తో కృషిచేసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కి, సీపీ తరుణ్ జోషికి, పంచాయతీరాజ్, కూడా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, గ్రేటర్ వరంగల్ మేయర్ , సిబ్బందికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కృతజ్ఞతలు తెలిపారు. ఈవెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు వరంగల్ నగరంలో నున్న చారిత్రకమైన ప్రదేశాలను చూపించుటకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈవెంట్ లో పాల్గొన్న క్రీడాకారులు మధుర జ్ఞాపకాలను వారి వెంట తీసుకు వెళ్లే విధంగా కృషి చేయాలన్నారు.

షాట్ పుట్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లాంగ్ జంప్ పోటీల్లో యువతను ఆకట్టుకున్నాయి. అటు పరుగుపందెంలో మహిళా స్ప్రింటర్లు ఉత్సాహం చూపారు. ఇక్కడి సౌకర్యాలపై అథ్లెట్లు సంతృప్తి వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ పోటీలకు వరంగల్ ఆతిథ్యం ఇవ్వడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టిఏ స్టాన్లీ జోన్స్, సీనియర్ వైస్ చైర్మన్ అంజూ బాబీ జార్జ్, స్పోర్ట్స్ అథారిటీ అథ్లెటిక్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్ రావు, కార్యదర్శి సారంగఫణి, డీవైఎస్ఓ అశోక్ కుమార్, టీజీఓ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ ఎ.జగన్మోహన్ రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.