మోదీ విధానాలపై కన్నెర్రజేసిన రైతన్న

మోదీ విధానాలపై కన్నెర్రజేసిన రైతన్ననిజామాబాద్ జిల్లా: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడితే కేంద్రప్రభుత్వం రైతులపై అమానుషంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన రైతులపై కేంద్రప్రభుత్వం అమానుషంగా లాఠీఛార్జీతో పాటు టియర్ గ్యాస్, వాటర్ కేన్ లతో దాడి చేయించడం ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సాయిగౌడ్ , జిల్లా నాయకులు మురళి మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, రైతులకు అన్యాయం చేసే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను చేస్తే, రైతులు చూస్తూ ఊరుకోరని అందుకే ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. కేంద్రప్రభుత్వం రైతుల సమస్యలు వినకుండా రైతు వ్యతిరేక విధానాలు తీసుకువచ్చి మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటని, పైగా అన్నంపెట్టే రైతులపైనే దాడి చేయించడం అమానుషమని మండిపడ్డారు. సబ్ కా సాత్ _ సబ్ కా వికాస్ అంటే రైతులను రోడ్డుమీద లాఠీఛార్జీ చేసి, కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాయడమేనా అని కేంద్రప్రభుత్వాన్ని వారు సూటిగా ప్రశ్నించారు. రైతులకు క్షమాపణ చెప్పి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.