వారి నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వారి నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వరంగల్ టైమ్స్, అమరావతి: ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్‌, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్‌ రెడ్డి నియామకాలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను కలిపి ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.సలహాదారుల నియామకంపై రాజ్యాంగబద్ధతను తేలుస్తామని పునరుద్ఘాటించింది. ఇలా నియమించుకుంటూ పోతే వీరి సంఖ్యకు పరిమితి ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది.

మరోవైపు ఎప్పటి నుంచో సలహాదారుల నియామకాలు జరుగుతున్నాయని, దీనిపై ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాజ్యాంగ విరుద్ధంగా వీరిని నియమించట్లేదని, కేబినెట్‌ హోదా కూడా ఇవ్వట్లేదని కోర్టుకు తెలిపారు. చాలామంది సలహాదారుల కాలపరిమితి ముగిసిపోనుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం బయట నుంచి నియమితులైన వారిలో జవాబుదారీతనం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. బయటి వారికి ప్రవర్తనా నియమావళి లేదని.. వారివల్ల సున్నిత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 28కు హైకోర్టు వాయిదా వేసింది.