జోరుగా జల్లికట్టు పోటీలు, ఒకరు మృతి

జోరుగా జల్లికట్టు పోటీలు, ఒకరు మృతివేలూరు జిల్లా : తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ జల్లికట్టులో పెనుప్రమాదం జరిగింది. తాడులో చిక్కుకున్న వ్యక్తిని ఎద్దు చాలా దూరం ఈడ్చుకెళ్లడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడలను నిర్వహిస్తారు. ఎద్దులను లొంగదీసుకోవడం ఈ ఆటలో ముఖ్యాంశం.

ఈ సాంప్రదాయ క్రీడ జల్లికట్టు ఏళ్లతరబడి కొనసాగుతోంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా వేలూరు జిల్లాలో కూడా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. పరిగెత్తుతున్న ఎద్దును ఓ వ్యక్తి అదుపు చేస్తున్నప్పుడు , ఆ వ్యక్తి తాళ్లకు చిక్కుకున్నాడు. దీంతో అతడిని ఎద్దు చాలా దూరం వరకు ఈడ్చుకుని వెళ్లింది.

స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అదేవిధంగా తిరుపత్తూరు ప్రాంతంలో కూడా ఎద్దుల పందాలు పోటీలు జరుగుతున్నాయి. ఈ జల్లికట్టు కార్యక్రమంలో ఎద్దు ప్రజలపైకి వచ్చి చాలా మందిని గాయపరిచింది. పొంగల్ తొలి రోజైన శుక్రవారం అవనియాపురంలో జల్లికట్టు తొలి పోటీని నిర్వహించడం గమనార్హం.

ఇందులో చాలా ఎద్దులు పాల్గొన్నాయి. అవనియాపురంలో జల్లి కట్టుని చూడటానికి వచ్చిన ఓ 18 యేళ్ల యువకుడిపై ఎద్దు దాడి చేసింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పాలమేడులో నిర్వహించే జల్లికట్టుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.