పాలమూరు బరిలో మోదీ..? 

పాలమూరు బరిలో మోదీ..?

పాలమూరు బరిలో మోదీ..? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : తెలంగాణపై సీరియస్ గా ఫోకస్ చేస్తున్న బీజేపీ హైకమాండ్ అన్ని లెక్కలను పక్కాగా వేసుకుంటున్నది. ఎలాగైనా తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకునే పనిలో ఉంది. అందులో భాగంగానే తెలంగాణ నుంచి నరేంద్రమోదీని పోటీ చేయించాలనే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి మోదీని నిలబెట్టాలనే ఆలోచనలో అమిత్ షా టీమ్ ఉన్నట్లు టాక్.

ప్రధాని మోదీని మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయించడం వెనక పలు కారణాలున్నాయి. పాలమూరు గడ్డపై బీజేపీ కొంత బలంగా ఉంది. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణ గట్టి పోటీనిచ్చారు. ఒక దశలో టీఆర్ఎస్ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించి, గెలిచినంత పని చేశారు. ఇక మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా గతంలో మహబూబ్ నగర్ నుంచే గతంలో ప్రాతినిధ్యం వహించారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు యెన్నెం శ్రీనివాస్ రెడ్డి. దీనికి తోడు మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. గట్టి నాయకులుంటే చాలు బీజేపీ తన బలాన్ని చాటుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. ఈమధ్య జితేందర్ రెడ్డి అయితే ఒక ప్రకటన కూడా చేశారు. ప్రధాని మోదీని మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని కోరుతానని చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఇతర నేతలు కూడా సుముఖంగా ఉన్నట్లు టాక్.

పాలమూరు ఎంపీ స్థానం నుంచి మోదీ నిలబడితే పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన లాభం ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం లాభం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బీజేపీ నేతలు కూడా ఒక లాజిక్ చెబుతున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి మోదీ నిలబడతారని అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రకటిస్తే చాలట. మోదీ ఫ్యాక్టర్ తో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి కలిసొస్తుందని లాజిక్ చెబుతున్నారట. మోదీ మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి ఉద్దండులు అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మోదీ ఇమేజ్ తో తాము ఈజీగా గట్టెక్కుతామన్న ఆలోచనలో వారు ఉన్నట్లు సమాచారం.

అన్ని లెక్కలను బేరీజు వేసుకున్నారో? లేదో? కానీ అమిత్ షా టీమ్ మాత్రం మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో మోదీని పోటీ చేయించాలన్న ప్రతిపాదనపై సీరియస్ గానే ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ సారి సర్వే కూడా చేసుకున్నట్లు టాక్. అది పాజిటివ్ గా రావడంతో మరోసారి సర్వే చేయడానికి కూడా బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

సర్వేలు, లెక్కలు ఎలా ఉన్నా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడంపై ప్రధాని మోదీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రతిపాదనపై మోదీ క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అన్నది పక్కనబెడితే మోదీ నిజంగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే.. బీజేపీకి అటు అసెంబ్లీ, ఇటు ఎంపీ ఎన్నికల్లో లాభం జరగడం మాత్రం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.