ఏపీలో వర్షాలు..11 మంది మృతి..30మంది గల్లంతు

ఏపీలో వర్షాలు..11 మంది మృతి..30మంది గల్లంతు
అమరావతి : ఏపీలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలో ఇప్పటి వరకు 30 మంది వరకు గల్లంతయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపత్తూరులో వాగు మధ్యలో ఉన్న శివాలయానికి దర్శనానికి వెళ్లిన 11 మంది భక్తులు చనిపోయారు.

చెంగల్ రెడ్డి, వెంకటరాజు, మల్లయ్య, చెన్నకేశవులు, గంగయ్య, శంకరమ్మ, వెంకట సుబ్బరాజు, ఆదెమ్మ, పద్మావతమ్మ, మహాలక్ష్మి, భారతమ్మగా మృ తులను గుర్తించారు. సిద్దవటం మండలం వెలుగుపల్లెల గ్రామంలో వరద ఉధృతికి ఐదుగురు గల్లంతయ్యారు.

చెయ్యేరు వరద నీటిలో మూడు ఆర్టీసీ బస్సులు చిక్కుకోగా ఒక పల్లె వెలుగు బస్సు పూర్తిగా నీట మునిగింది. ఈబస్సులో కండక్టర్ అహోబిలంతో సహా మరో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో రెండు బస్సుల్లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో ముగ్గురు ప్రయాణికులు చెట్టు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. మరో ఆరుగురు ప్రయాణికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.