పాలిసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

పాలిసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలఅమరావతి : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను స్థాపిస్తామని ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ సంవత్సరం నుండే పాలిటెక్నిక్ కాలేజీల్లో ఐదు కొత్త టెక్నికల్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంత్రి గౌతమ్ రెడ్డి.. పాలిసెట్ -2021 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను స్థాపిస్తామని తెలిపారు.

ఏపీ పాలిటెక్నిక్‌ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 (పాలిసెట్‌) ఫలితాలు విడుదల అనంతరం మంత్రి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 (94.2%) మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్‌లాల్‌, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్‌ మొదటి ర్యాంకు సాధించారు. వీరిరువురికి 120 మార్కులు వచ్చాయని మంత్రి ప్రకటించారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని మంత్రి పేర్కొన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

మరో వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి మేకపాటి తెలిపారు. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 81 వేల మందికి రూ. 128 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ. 54 కోట్లు విద్యార్థులకు అందించామన్నారు. ‘‘కొన్ని రకాల ప్రత్యేక పరిస్థితుల వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేవారన్నారు. ఆ సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది’’అని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

పాలిసెట్-2021(AP Polycet 2021) రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ (Official Website)లో చెక్ చేసుకోవచ్చని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్ మెంట్ & ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.