దారిదోపిడీ ముఠా అరెస్ట్

దారిదోపిడీ ముఠా అరెస్ట్వరంగల్ అర్బన్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో దారిదోపిడీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముఠాను ఎట్టకేలకు హన్మకొండ పోలీసులు పట్టుకున్నారు. దారిదోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యుల్లో ఇద్దరు బాలనేరస్తుల సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు. నిందితుల నుంచి రూ.1లక్షా50వేల నగదు, 30 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, దోపిడీలకు పాల్పడేందుకు నిందితులు వినియోగించిన ఒక ఆటో, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ అర్బన్ జిల్లా శంభునిపేటకు చెందిన షాగంటి అలియస్ చాగంటి వంశీ, వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్ వాస్తవ్యుడు , ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గోదావరి ‌ఖనిలో నివాసముంటున్న షేక్ ఆసీఫ్ అలియస్ ఆజ్ఞు, మరో ఇద్దరు బాల నేరస్తులతో పాటు, ప్రస్తుతం పరారీలో వున్న నేరస్తుడు వరంగల్ అర్బన్ జిల్లా శంభునిపేటకు చెందిన కాంపెల్లి మణి వున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును హన్మకొండ పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో అరెస్ట్ కు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ ఇంఛార్జ్ డి.సి.పి పుష్ప మీడియాకు తెలిపారు. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన గుండా ఓదేలు గత నెల నవంబర్ 25 అర్థరాత్రి సమయంలో హైదరాబాద్ నుండి హన్మకొండకు వచ్చి, హన్మకొండ బస్టాండ్ నుంచి ఓ కిరాయి ఆటోలో వరంగల్ పోచమ్మమైదాన్ కు పయణమైన బాధితుడు ఓదేలును ఆటో డ్రైవర్ పోచమ్మమైదాన్ లో దించకుండా, తనతో పాటు ప్రయాణిస్తున్న మిగతా నలుగురు నిందితుల సహాయంతో బాధితుడిని ఆటోలోనే నిర్భంధించారు. ఆటోలో ఓదేలును నిర్భంధించి అటుగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలోని జాన్ పీరీలు వద్ద నిర్మానుష్యంగా వున్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి బాధితున్ని చితకబాది, అతని ఒంటిపై వున్న 19 గ్రాముల బంగారు గొలుసుతో పాటు , ఒక సెల్ ఫోన్, రూ.400 నగదును నిందితులు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు ఓదేలు హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డి.సి.పి. సూచనల మేరకు బస్టాండ్ ప్రాంతంలో నిఘా పెట్టారు. డిసెంబర్ 03న ఈ ఘటన చోటుచేసుకోగా నిఘాను పెట్టిన పోలీసులకు నిందితులు చిక్కిపోయారు. హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో దోపిడీ చేసిన సెల్ ఫోన్ ను అమ్మేందుకు యత్నించిన బాల నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టురట్టైంది. ఇద్దరు బాలనేరస్తులను , వారు వినియోగించిన ఒక సెల్ ఫోన్ ను, ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు బాలనేరస్తులను కోర్టులో హాజరుపరిచారు. విచారణలో బాలనేరస్తులు ఇచ్చిన సమాచారం మేరకు హన్మకొండ ఇన్స్ పెక్టర్ చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి హన్మకొండ చౌరస్తాలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చోరీ సొత్తును అమ్మేందుకు వచ్చిన ముగ్గురు నిందితులు పోలీసుల కంటపడ్డారు. వీరిలో ఒక నిందితుడు పారిపోగా, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల ఎదుట నిందితులు దారిదోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్.ఐలు రవీందర్, రఘుపతి, కానిస్టేబుల్లు బావుసింగ్, శివ, సుమన్, గౌస్ పాషాలను డి.సి.పి పుష్పా అభినందించారు.