టీకారంగంలో ఎన్నో ప్రయోగాలు

టీకారంగంలో ఎన్నో ప్రయోగాలుహైదరాబాద్‌: టీకా రంగంలో భారత్‌ ఎన్నో ప్రయోగాలు చేస్తోందని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా అన్నారు. భారత్‌లో కరోనా టీకాల తయారీపై అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్న 64 దేశాల రాయబారులు జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్‌ టీకా వివరాలతో పాటు సంస్థ ప్రస్థానాన్ని కృష్ణ ఎల్లా వారికి వివరించారు. భారత్‌ బయోటెక్‌ను ఎందరో ప్రముఖులు సందర్శించారని.. పదిరోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ కూడా వచ్చారని చెప్పారు. అనేక విదేశీ సంస్థలతో భారత్‌ బయోటెక్‌ ప్రయోగాలు చేస్తోందన్నారు. సానుకూల దృక్పథంతో తమ సంస్థ ముందుకు సాగుతోందని వివరించారు. భారత్‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ రాయబారుల పర్యటన ఏర్పాటు చేసింది. వీరంతా రెండు బృందాలుగా ఏర్పడి నగంలో పర్యటిస్తున్నారు. ఒక బృందం జీనోమ్‌వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను.. మరో బృందం బయోలాజికల్‌-ఇ సంస్థను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించాయి.