భద్రాద్రిలో మొదలైన సీతారాముల కల్యాణ వేడుకలు 

భద్రాద్రిలో మొదలైన సీతారాముల కల్యాణ వేడుకలు

వరంగల్ టైమ్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి రామాలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. నేడు సీతారాములను వధూవరులను చేసే వేడుకను నిర్వహించనున్నారు. లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవం సందర్భంగా నేడు నిత్య కల్యాణాన్ని, మూలమూర్తులకు స్వర్ణ కవచ అలంకరణ నిలిపివేశారు. ఈ రోజు మూలమూర్తులకు విశేషస్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 10న సీతారాముల కల్యాణ మహోత్సవం, ఏప్రిల్ 11న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.భద్రాద్రిలో మొదలైన సీతారాముల కల్యాణ వేడుకలు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు పవిత్ర పుణ్య జలాలను గోటి తలంబ్రాలపై చల్లుతారు. రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఆవాహన చేసి రోకలికి కంకణధారణ చేస్తారు. 9 మంది ముత్తైదువులు పసుపు కొమ్ములు దంచుతారు. స్వామివారిపై బుక్కా, గులాల్, అత్తరు, పన్నీరు చల్లుతారు. పసుపు, కుంకుమతో పాటు ఇతర ద్రవ్యాలు కలిపి 1, 108 మంది మహిళలు తలంబ్రాలు కలుపుతారు. దీంతో రామయ్య పెండ్లి పనులు మొదలైనట్లు పరిగణిస్తారు.

అనంతరం అర్చకులు, వసంతుడిని ఆవాహన చేసి 9 పసుపు ముద్దలను సిద్ధం చేస్తారు. మంత్రాలను జపిస్తూ వసంతాన్ని ప్రోక్షిస్తారు. పసుపు ముద్దల్లో ఒక ముద్దను రామయ్య శిరస్సుపై, రెండోది అమ్మవారి మంగళసూత్రం వద్ద, మూడో మద్దను లక్ష్మణస్వామి వారిపై ఉంచుతారు. అప్పటి నుంచి సీతారాములు పెండ్లికొడుకు, పెండ్లి కుమార్తెగా భావిస్తారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు తెచ్చిన భక్తులు ఆలయ అధికారులకు అందచేస్తారు.