టీంఇండియా ఆలౌట్..సఫారీల టార్గెట్ 212

టీంఇండియా ఆలౌట్..సఫారీల టార్గెట్ 212స్పోర్ట్స్ డెస్క్ : మూడో టెస్టు చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. కోహ్లీ , పంత్ క్రీజులో ఉన్నంత సేపు ఆధిపత్యం చెలాయించిన టీంఇండియా, కోహ్లీ ఔటైన తర్వాత ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా పంత్, తన దూకుడైన ఆట ఆడలేకపోయాడు. దీంతో స్కోరుబోర్డు వేగం మందగించింది. కోహ్లీ తర్వాత వచ్చిన అశ్విన్, శార్దూల్, షమీ, ఉమేష్, బుమ్రా ఎవరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఎదురొడ్డిన పంత్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాతి ఓవర్లలో జాన్సెన్ బౌలింగ్ లో బుమ్రా ఔటయ్యాడు. దీంతో భారత జట్టు 198 పరుగులకు ఆలౌట్ అయింది.

సఫారీల ముందు 212 పరుగుల లక్ష్యం నిలిపింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (10), మయాంక్ (7), పుజారా (9), కోహ్లీ (29), రహానే (1), అశ్విన్ (7), శార్దూల్ (5), ఉమేష్ (0), షమీ (0), బుమ్రా (2) పరుగులు చేయగా, పంత్ ఒక్కడే వంద పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో టెస్టులో 240 పరుగుల టార్గెట్ ఛేదించిన సఫారీలను 212 పరుగులలోపు కట్టడి చేయడం ఇండియా బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది. అయితే ఈ టెస్టులో కెప్టెన్ కోహ్లీ వ్యూహాలు కీలకంకానున్నాయి.