పట్టాలు తప్పిన గౌహతి- బికనీర్ ఎక్స్ ప్రెస్

పట్టాలు తప్పిన గౌహతి- బికనీర్ ఎక్స్ ప్రెస్కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పాట్నా నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి- బికనీర్ ఎక్స్ ప్రెస్ బెంగాల్ లోని మైనాగురి సమీపంలో గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో రైలు 40 కిలో మీటర్ల వేగంతో వెళుతుండగా ఆరు బోగీలు తలకిందులయ్యాయి. రైలులో ఎంతమంది ప్రయాణీకులున్నారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. రైలు ప్రమాదంలో 12 కోచ్ లు దెబ్బతిన్నాయని ప్రమాద స్థలానికి డీఆర్ఎం, ఏడీఆర్ఎం చేరుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు.

రైలు పట్టాలు తప్పడంతో పలువురు బోగీల నుంచి కిందకు దూకడం కనిపించింది. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రైలు భారీ కుదుపుకు లోనవడంతో తాము రైలు పట్టాలు తప్పినట్లు గుర్తించామని బికనీర్- గౌహతి ఎక్స్ ప్రెస్ ప్రయాణీకుడు తెలిపారు. గౌహతి- బికనీర్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై రైల్వే భద్రతా విచారణకు ఆదేశించామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేసి రైలు ప్రమాద ఘటనపై ఆరా తీశారు.