దేశానికి దిక్సూచి తెలంగాణనే : కేటీఆర్
వరంగల్ టైమ్స్, సూర్యాపేట జిల్లా : బీజేపీ ఉచ్చులో యువత పడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని, మతాల మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ పని అని ఆయన ధ్వజమెత్తారు. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్, చండూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా హుజూరునగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లపై విమర్శల వర్షం కురిపించారు. కిషన్ రెడ్డి లాంటి సన్నాసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని దుయ్యబట్టాడు. ఆయన మాట్లాడేవన్నీ అబద్దాలేనని, నిలదీస్తే ఒక్క సమాధానం కూడా చెప్పడని కిషన్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. ఇక బీజేపీ వల్ల కార్పొరేట్ శక్తులు బాగుపడ్డాయి. ప్రజలు మాత్రం మరింత అగాధంలోకి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ వల్ల దేశం అప్పులపాలైందని ఎద్దేవా చేశారు.
భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. దేశానికి వేగు చుక్క మన తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రూ. 30వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రామెగా పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఉపఎన్నికల తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ఎవరి వల్ల రాష్ట్రం ముందుకు పోతుందో ప్రజలే గమనించాలని సూచించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బీజేపీ నాయకులు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని కుట్రలు చేస్తున్నది బీజేపీ అని మండిపడ్డారు. బీజేపీ వల్ల ఒక దళితుడిని, ఒక గిరిజన వ్యక్తిగానీ బాగుపడ్డ దాఖలాలు లేవు అని కేటీఆర్ స్పష్టం చేశారు.