పాత సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం

హైదరాబాద్‌: పాత సచివాలయం కూల్చివేత పనులు సోమవారం అర్ధరాత్రి నుంచి మొదలయ్యాయి. వచ్చే ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి కొత్త సచివాలయంలో కొలువుదీరాలన్న లక్ష్యం దిశగా పనులను వేగంగా చేపడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ నగర సీపీ అంజనీకుమార్‌ కూల్చివేత పనులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌.. రోడ్లు భవనాలశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్టు సమాచారం. ట్రాఫిక్‌ మళ్లింపు, భద్రత తదితర అంశాలను పోలీస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భవనాల కూల్చివేత నేపథ్యంలో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురుకాకుండా బీఆర్కేభవన్‌లోని అన్ని కార్యాలయాలకు ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.పాత సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం

సీబ్లాక్‌ నుంచి కూల్చివేతలు మొదలు
పాత సచివాలయం కూల్చివేతను మొదట ‘సీ’ బ్లాక్‌ నుంచి ప్రారంభించారు. ఆ దిశగా రాకపోకలను నిషేధించి, ట్రాఫిక్‌ను మళ్లించారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. చుట్టుపక్కల భవనాలకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదన్న సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. శిథిలాలు ఎగిరిపడకుండా ఆధునిక పద్ధతులు, ఆధునిక యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు అన్ని భవనాల పైభాగాలను కూల్చివేసినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో అన్ని భవనాలను నేలమట్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల తరలింపును నెలాఖరుల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం.