వీల్ చైర్ క్రికెట్ టోర్నీలో విజేతగా తెలంగాణ

వీల్ చైర్ క్రికెట్ టోర్నీలో విజేతగా తెలంగాణహనుమకొండ జిల్లా : ప్రతీ క్రీడాకారుడు వీల్ చైర్ క్రీడాకారులను (దివ్యాంగులను) స్ఫూర్తిగా తీసుకుని క్రీడలలో రాణించాలని తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు, మాజీ కార్పోరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గత రెండ్రోలుగా నిర్వహించిన ఈ క్రీడలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు.

మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు, మాజీ కార్పోరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ హాజరయ్యారు. అయితే వీల్ చైర్ క్రికెట్ టోర్నీలో రాజస్థాన్ పై తెలంగాణ జట్టు 101 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. తొలుత రాష్ట్ర దివ్యాంగుల జట్టు 15 ఓవర్లలో 197 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ 96 పరుగులకే కుప్పకూలింది. సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటుతూ తెలంగాణ జట్టు , ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ఈ టోర్నీ ముగింపు కార్యక్రమానికి హాజరైన దాస్యం విజయ్ భాస్కర్ విజేతగా నిలిచిన తెలంగాణ టీంకు ట్రోఫీతో పాటు క్రికెట్ కిట్, నగదు బహుమతి అందచేశారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు. వారి విజయంతో రాష్ట్రానికి మరింత పేరు తీసుకొచ్చారని దాస్యం విజయ్ భాస్కర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కవిత, అనితారెడ్డి, వీల్ చైర్ కెప్టెన్ శ్రీధర్, భరత్, మిగతా జట్ల క్రికెటర్లు పాల్గొన్నారు.