30 మంది గులాబీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ ? 

30 మంది గులాబీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ ?

30 మంది గులాబీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ ? వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో గులాబీ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు రెండు, మూడుసార్లు వరుసగా గెలిచిన వారే. దాంతో చాలామంది వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీలో ఉండడంతో సాధారణంగా ఉండే వ్యతిరేకతకు తోడు,కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగానూ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది. దీంతో అలాంటి ఎమ్మెల్యేలంతా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారట.

రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సాధ్యమైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేయడంపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. ముఖ్యంగా రోడ్ల పనులన్నీ వేగం అందుకున్నాయి. ఇక ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు లేని వారికి సాధ్యమైనంత త్వరగా అవి ఇప్పించేందుకు ఎమ్మెల్యేలు చొరవ చూపుతున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి.

*కేసీఆర్ ఇమేజ్ తో గట్టెక్కాలనుకుంటున్నారా !
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అలాంటి అలసత్వం ప్రదర్శించే ఎమ్మెల్యేలున్నారట. అందుకే ఒకప్పుడు గులాబీకి కంచుకోట అయిన ఓరుగల్లులోనూ ఈసారి కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితే పలు జిల్లాల్లో ఉందట. అందుకే కేసీఆర్ బొమ్మనే అలాంటి ఎమ్మెల్యేలు నమ్ముకుంటున్నారని టాక్. కేసీఆర్ ఇమేజ్ తోనే గట్టెక్కాలని సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.30 మంది గులాబీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ ? 

*చిట్టా విప్పే దాకా తెల్వదు.. టికెట్ ఎవరికనేది!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ దగ్గర మొత్తం చిట్టా ఉందట. ఎవరు యాక్టివ్ గా ఉన్నారు? ఎవరు మొద్దునిద్ర పోతున్నారన్న దానిపై ఇప్పటికే సర్వే కూడా చేయించినట్లు టాక్. చాలామంది ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నారన్న విషయం కేసీఆర్ కు కూడా అర్థమైందట. దీంతో వారిని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారట. అందుకే సిట్టింగులందరికీ టికెట్లిస్తామని కేసీఆర్ చెప్పినప్పటికీ అందరికీ ఇవ్వకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలామంది భూకబ్జాలు, దందాలు, ఇతర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేసీఆర్ ఒక టీమ్ ను ఏర్పాటు చేశారని టాక్. ఎమ్మెల్యేలపై ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ఈ టీమ్ ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి ఎమ్మెల్యేల లిస్టు కేసీఆర్ దగ్గర ఉందట. దాని ఆధారంగా కేసీఆర్ గట్టి నిర్ణయం తీసుకోవచ్చని గులాబీ శ్రేణులు చెబుతున్నారు.30 మంది గులాబీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ ? *సిట్టింగులందరికీ మళ్లీ ఛాన్స్ కష్టమే..
కనీసం 30 మందిని కేసీఆర్ మార్చే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ మార్పులు ఎక్కువగా ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ సీట్లు గెల్చుకోవాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారట. దక్షిణ తెలంగాణలో నష్టం జరిగే అవకాశాలున్నాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారట. దానిని పూడ్చుకునేందుకు ఉత్తర తెలంగాణపై కేసీఆర్ ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. దక్షిణ తెలంగాణలోనూ కొందరు సిట్టింగులకు ఛాన్స్ ఇవ్వడానికి కేసీఆర్ సుముఖంగా లేరట.

ఏదేమైనా కేసీఆర్ మాత్రం సిట్టింగులందరికీ ఛాన్స్ ఇవ్వకపోవచ్చని గులాబీ శ్రేణులు కూడా చెబుతున్నారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేల పనితీరు, సర్వేల ఆధారంగానే ఈసారి టికెట్లు ఇచ్చే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అవకాశముంది. అందుకోసం కేసీఆర్ పకడ్బందీ ప్లానింగ్ రూపొందిస్తున్నారట. ఇప్పటికే టికెట్ల కేటాయింపుపై కసరత్తు కూడా మొదలైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి కేసీఆర్ మనసును గెలుచుకుని గులాబీ టికెట్లు సాధించేవారెవరో? గల్లంతయ్యేవారెవరో?