సమస్యల పరిష్కారం దిశగా గులాబీ దండు కదలాలి : దాస్యం

సమస్యల పరిష్కారం దిశగా గులాబీ దండు కదలాలి : దాస్యంహనుమకొండ జిల్లా : కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. ప్రజల ఆరోగ్యం, కరోనా వైరస్ నిర్మూలనకై స్థానిక ప్రజాప్రతినిధులు , ముఖ్య కార్యకర్తలు సైన్యంలా పనిచేయాలని దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు. సుబేదారిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో నెలసరి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఓవైపు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, మరో వైపు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మొదలగు అంశాలపై నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు చీఫ్ విప్ దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కార్పొరేటర్లు, నాయకులు డివిజన్లలో సమస్యలు సూచించినట్లైతే వాటి పరిష్కరానికై ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులను కోరారు.

317 జీవోపై అసత్య ప్రచారాలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్న బీజేపీ దాడిని సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టాలని సూచించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో వరంగల్ కి అనేకసార్లు వచ్చిన కిషన్ రెడ్డి వరంగల్ పర్యాటక అభివృద్ధికి మాత్రం న్యాయం చేసిన దాఖలాలే లేవని దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలతో పాటు విభజనలో పొందు పరిచిన పలు అంశాలను నెరవేర్చలేదని మండిపడ్డారు. గులాబీ దండు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పని చేయలని చీఫ్ విప్ సూచించారు. కొవిడ్ ప్రభావం తీవ్రతరం అవుతున్న వేళ సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకే తీసుకెళ్లి ఇవ్వాలని నియోజకవర్గ ముఖ్య నాయకులను, కార్యకర్తలను దాస్యం ఆదేశించారు.