ఇంటర్నెట్ డెస్క్ : ఆఫ్రికా దేశమైన ఘనాలో భారీ పేలుడు సంభవించింది. దీంతో 17 మంది మరణించగా, వందలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి. మరో 50 మంది గాయపడ్డారు. బంగారు గనులకు నిలయమైన బొగోసో పట్టణానికి సమీపంలో అపియేట్ వద్ద పేలుడు పదార్థాలతో వెళ్తున్న ట్రక్కు, ఓ బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 500లకు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 57 మంది గాయపడ్డారని, వారందరినీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
బంగారు గనులకు పేలుడు పదార్థాలు తీసుకెళ్తుండగా ఈ పేలుళ్లు సంభవించాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలు లభించాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, భారీ పేలుడు సంభవించడంతో చుట్టూ కూలిన ఇండ్లే కనిపిస్తున్నాయి. 2015 లో ఘనాలో జరిగిన ఇలాంటి ప్రమాదంలోనే 150 మందికి పైగా మరణించారు. 2017లో అక్రా సమీపంలో గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో ముగ్గురు చనిపోగా, డజన్లకొద్ది గాయపడ్డారు.