మహాశివరాత్రి పర్వదినం విశిష్టత

మహాశివరాత్రి పర్వదినం విశిష్టత

మహాశివరాత్రి పర్వదినం విశిష్టతవరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతీ నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహా శివరాత్రి అంటారు.

*బిల్వార్చన :
ప్రధానంగా పండుగను శివుడికి బిల్వ ఆకుల సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది. పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము/విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు “ఓం నమః శివాయ”, శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.

*ఆధ్యాత్మిక శక్తి :
తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో “మీరు ఈనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది” అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెందగలదని చెబుతాడు.

*జాగరణము :
జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున ఉపవాసము ఉంటారు.
ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు.

*రుద్రాభిషేకం :
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీని ద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

*పంచాక్షరి మంత్రం :
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు “న” “మ” “శి” “వా” “య” (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.

*మహామృత్యుంజయ మంత్రం :
మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదంలోని ఒక మంత్రము. దీనినే “త్రయంబక మంత్రము”, “రుద్ర మంత్రము”, “మృత సంజీవని మంత్రము” అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదంలో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.

“ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్”