నేడు కొమురవెల్లి మల్లన్న కల్యాణం

నేడు కొమురవెల్లి మల్లన్న కల్యాణంసిద్దిపేట జిల్లా : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. శాశ్వత కల్యాణ వేదిక వద్ద కొవిడ్‌ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు.

విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. మల్లన్న కల్యాణానికి ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. హరీశ్‌రావుతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు హాజరుకానున్నారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం వరుడు శ్రీమల్లికార్జునస్వామి వారి తరపున పడిగన్నగారి వంశస్థులు, వధువులు శ్రీమేడలాదేవి, శ్రీకేతమ్మ దేవీ తరపున మహాదేవుని వంశస్థులు ఆదివారం ఉదయం 10.45 గంటలకు కల్యాణాన్ని జరిపించనున్నారు.