నేడే మేడారం వనజాతర ప్రారంభం

నేడే మేడారం వనజాతర ప్రారంభంవరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: ఆసియా ఖండంలోనే రెండేళ్లకొకసారి జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం బుధవారం రోజు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు కొనసాగే ఈ వనదేవతల మహాజాతర బుధవారం రోజు సారలమ్మ రాకతో ప్రారంభమవుతుంది. సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోని చిన్న దేవాలయంలో సారలమ్మ కొలువై ఉంది. ఫిబ్రవరి 16 జాతరలో మొదటి రోజు. ఉదయాన్నే పూజారులు రెండు గంటలపాటు పూజలు నిర్వహించిన అనంతరం, సారలమ్మను కన్నెపల్లి నుంచి కాక వంశస్తులు గద్దె వద్దకు తీసుకొస్తారు. పూనుగొండ్ల నుంచి పెనక వంశస్తులు సమ్మక్క భర్త పగిడిద్దరాజును, కొండాయి నుంచి పెనక వంశస్తులు సారలమ్మ భర్త గోవిందరాజులను మేడారంలోని గద్దెకు తీసుకొస్తారు.

జాతర ప్రారంభంలో సారలమ్మ, పగిదిద్ద రాజులు, గోవిందరాజులు, నాగులమ్మలను మేడారం గద్దెల వద్దకు పూజారులు తీసుకొచ్చే సమయంలో భక్తులు తడిబట్టలతో గుడి ఎదుట తల్లికి వందనం సమర్పిస్తారు. దేవతారూపాన్ని చేతబట్టుకుని బయటికి వచ్చిన పూజారులు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న వారిపై నుంచి నడిచి వెళ్తారు. సారలమ్మే తమపైనుంచి వెళ్తున్న అనుభూతితో భక్తులు తరించిపోతారు. మంగళహారతులు, కొబ్బరి కాయలతో పూజలు చేసి సారలమ్మను మేడారానికి సాగనంపుతారు. అక్కడినుంచి సారలమ్మను తీసుకుని బయల్దేరిన పూజారులు జంపన్న వాగునుంచి నేరుగా మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు తీసుకొస్తారు. అలా ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి గద్దెలపైకి రావడంతోతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది.