బ్లాక్ స్టిక్కర్లపై ట్రాఫిక్ పోలీసుల కొరడా
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలో జంటనగరాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న వరుస కారు ప్రమాదాలపై నగర వాసుల్లో ఆందోళన నెలకొంది. ఈనేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈక్రమంలో జంటనగరాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన నేపథ్యంలో బ్లాక్ స్టిక్కర్స్ తో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్స్ తో పాటు బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ లతో తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ , బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
జూబ్లీహిల్స్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రైవ్ లో నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ వాడకంపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద ట్రాఫిక్ పోలీసులు 180 కేసులు నమోదు చేశారు. బ్లాక్ ఫిల్మ్ తొలగించడంపై కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు వారాల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడతామని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.