యునెస్కో గుర్తింపు..రామప్పను సందర్శించిన మంత్రులు

యునెస్కో గుర్తింపు..రామప్పను సందర్శించిన మంత్రులుములుగు జిల్లా : వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయం రామప్పకు ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యునెస్కో నిబంధనల ప్రకారం పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే మంగళవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి రామప్పను సందర్శించారు.

వారి వెంట మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఉన్నారు. రామప్ప సందర్శనకు వచ్చిన మంత్రుల బృందాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. అనంతరం రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రుల బృందానికి ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప దేవాలయం అంతా పరిశీలించి, ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. రామప్పను సందర్శించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం మీడియాతో మాట్లాడారు.యునెస్కో గుర్తింపు..రామప్పను సందర్శించిన మంత్రులుగుర్తింపు రావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు : మంత్రి ఎర్రబెల్లి
రామప్పను ప్రపంచ పటంలో గుర్తించే విధంగా యునెస్కో గుర్తింపు రావడంతో, ప్రపంచ స్థాయిలో ఖ్యాతి వచ్చిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంలో రష్యా లీడ్ తీసుకుందని మంత్రి తెలిపారు. మద్దతిచ్చిన 17 దేశాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాధించడంలో కృషిచేసిన కేంద్ర ప్రభుత్వానికి, స్వచ్ఛంధ సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రామప్ప దేవాలయ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం, చరిత్ర, శిల్ప కళా నైపుణ్యం తీరుపై సీఎం కేసీఆర్ రాసిన లేఖ దేశాల మద్దతుకు ఉపయోగపడిందన్నారు. రామప్ప గుర్తింపుతో

ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి స్థానికుల సహకారం ఎంతో అవసరమన్నారు. భూసేకరణ 27ఎకరాలు చేయాల్సి ఉందని, ఇందుకు రైతులు సహకరించాలని మంత్రి తెలిపారు. భూములు కోల్పోయిన వారందరికీ న్యాయం చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇప్పటికే పర్యాటకుల రద్దీ పెరిగిందని, విదేశాలనుండి వచ్చే పర్యాటకులు 3 రోజులు ఉండేలా అన్ని వసతులు కల్పించాలని మంత్రి అన్నారు.

రామప్ప దేవాలయానికి గుర్తింపు వస్తే పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందని, ఈ ప్రాంత భవిష్యత్తు మారుతుందని సీఎం వెంటపడి, యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు. మరింత అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రణాళికలు సిద్దం చేస్తామని అన్నారు. కాకతీయ హెరిటేజ్ టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందన్నారు. దీనిని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి ఏర్పాటుకు కృషి చేస్తామని దయాకర్ రావు అన్నారు.

యునెస్కో గుర్తింపులో సీఎం కృషి ఫలించింది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ వచ్చాక సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నామని, రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం ప్రభుత్వం రెండేళ్లుగా చేసిన కృషి ఫలించిందన్నారు పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నో పథకాలకు మన రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం మనకు గర్వకారణమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన డెవలప్మెంట్స్ కోసం సీఎం సూచనతో పరిశీలనకు వచ్చామన్నారు. కేంద్రానికి పన్నులు కోట్ల రూపాయలు కడుతున్నాం. .చాలా రాష్ట్రాల్లో కట్టిన పన్నులకంటే ఎక్కువ వస్తుందని, మనకు కూడా ఏదో రూపంలో రాష్ట్రానికి నిధులు ఇస్తే సంతోషిస్తామన్నారు.

రామప్ప దేవాలయం ప్రాంతంలో అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. విదేశీ పర్యాటకులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గత నాలుగేళ్లుగా 7 కోట్లు ఖర్చు చేశామని మరో 15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రామప్పతో పాటు సమాంతరంగా ఉన్న వేయిస్థంబాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ , ఇతర ఆలయాలు, లేక్స్ తో కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ చేయాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు త్వరలోనే జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత పరిరక్షణ కోసం నిబంధనలకు విరుద్ధంగా స్థానిక ప్రజలు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆయన సూచించారు.యునెస్కో గుర్తింపు..రామప్పను సందర్శించిన మంత్రులురామప్పను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తాం : మంత్రి సత్యవతి
తెలంగాణలో సీఎం కేసిఆర్ ఆలయాల అభివృద్దికి చర్యలు చేపడుతున్నారని, ఆయన కృషితో యునెస్కో గుర్తింపు రావడంతో, ప్రపంచం రామప్ప వైపు చూసే గొప్ప అవకాశం వచ్చిందని గిరిజన సంక్షేమం, స్త్రీ-శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దేనికి లభించని గుర్తింపు మనకు రావడం నిజంగా గర్వకారణం అని అన్నారు. సీఎం కేసిఆర్ కు ఇక్కడి కళలు, శిల్ప నైపుణ్యం పై ఆయనకున్న పట్టు ఎవరికీ లేదని అన్నారు. ఏ టెక్నాలజీ లేని ఆ సమయంలో ఇంత గొప్ప కట్టడం నిర్మించడం నిజంగా చాలా గొప్ప విషయమని అన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పేరిట పాపారావు, పాండురంగ రావు, ఎంపీలు చేసిన కృషి అన్నీ తోడై నేడు దీనికి గొప్ప గుర్తింపు వచ్చిందని మంత్రి సత్యవతి కొనియాడారు. యునెస్కోలో కొన్ని షరతులు పెట్టినప్పుడు గొప్ప దౌత్యం చేసి మనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ, ఇందుకు ముందడుగు వేసిన సీఎం కేసిఆర్ కి పాదాభివందనం అని మంత్రి అన్నారు. ఇక్కడికి భక్తులు, పర్యాటకులు పెరుగుతున్న నేపథ్యంలో ఔట్ పోస్ట్, త్రాగునీరు, కనీస వసతులు కల్పించాలని అధికారులను కోరారు.

టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలి : ఎమ్మెల్యే సీతక్క
ములుగు గడ్డకు ప్రత్యేకత ఉందని, రామప్పకి యునెస్కో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని ములుగు ఎమ్మెల్యు సీతక్క అన్నారు. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ది చేయాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. కాకతీయులు ఎక్కడ ఉన్నా టెంపుల్ టౌన్ కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇన్నేండ్ల తర్వాత రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. రామప్పను అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రొఫెసర్ పాండు రంగారావు, పాపారావు చేసిన కృషి ఎనలేనిదన్నారు. లక్నవరం దగ్గర పురాతన గుడి, పాకాల దగ్గర రామక్క టెంపుల్ లను అభివృద్ది చేయాలని కోరారు. రామప్పకు సమీపంలోని గుట్టల మధ్య ఉన్న ఇంచెం చెరువును అభివృద్ది చేస్తే పర్యాటకంగా మారుతుందని సూచించారు. రామప్ప టూరిజం డెవలప్మెంట్ లో భవిష్యత్ లో జరిగే భూసేకరణలో బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీతక్క కోరారు.

ఈ కార్యక్రమంలో జలవనరుల సంఘం చైర్మన్ వీరమల్ల ప్రకాశరావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్, టూరిజం సెక్రటరీ శ్రీనివాసరాజు, జిల్లా రెవెన్యూ అధికారిని రమాదేవి, స్థానిక సర్పంచ్ రజిత, జడ్పీటీసీ, ఎంపిటిసిలు, రామప్ప ఇ.ఓ. బిల్లా శ్రీనివాస్, తహసీల్దార్ మంజుల, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.