స్పందించని కేంద్రం..వెనక్కి తగ్గని రైతు సంఘాలు

స్పందించని కేంద్రం..వెనక్కి తగ్గని రైతు సంఘాలుఢిల్లీ : కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు సోమవారం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా…వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై తీసుకునే నిర్ణయాలను తోమర్ హోంమంత్రితో చర్చించారు. కేబినేట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, హో శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘాల నాయకులు సాయంత్రం 5 గంటలకు ఘాజీపూర్ లో భేటీ అయి చర్చలు జరుపనున్నట్లు సమాచారం. అనంతరం మంగళవారం ఉదయం 11 గంటలకు సింఘు సరిహద్దు వద్ద మరోసారి సమావేశం కానున్నట్లు సమాచారం.

అయితే 19 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం 6 సార్లు భేటీ అయినప్పటికీ చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు ఈ రోజు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న బలమైన డిమాండ్ తో నిరసనలు చేస్తున్న రైతు సంఘాల నాయకులపై బీజేపీ అధికార నేతలు గుర్రుగా వున్నప్పటికీ, రైతు సంఘాలకు మద్దతుగా అనేక మంది నిలుస్తున్నారు..

ఢిల్లీ సీఎం ..డిప్యూటీ సీఎంల నిరసన దీక్ష
అన్నదాతలకు మద్దతుగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నిరసన దీక్ష చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రైతుల దీక్ష నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే అనేక సరిహద్దులను మూసివేసిన పోలీసులు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.