ఫిఫా సాకర్ సమరంలో విశ్వ విజేత ఎవరో ?
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : సాకర్ యుద్ధంలో విశ్వ విజేతగా ఎవరు నిలుస్తారోనని ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పోరులో విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోనుంది. ఆదివారం ఆఖరి పోరులో అర్జెంటీనాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తలపడనుంది. వరల్డ్ కప్ గెలుచుకోవాలన్న మెస్సి కల నెరవేరుతుందా? ఫ్రాన్స్ వరుసగా రెండో సారి టైటిల్ సాధిస్తుందా ? అంటూ చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే మెగా టోర్నీలో అత్యధిక గోల్స్ తో బంగారు బూటు దక్కించుకునే ఆటగాడు ఎవరా? అన్న ఆసక్తి నెలకొంది. ఈ సమరంలో అర్జెంటీనా కెప్టెన్ మెస్సి, ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె ముందు వరుసలో ఉన్నారు.తమ టీంలు తుదిపోరు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ అగ్రశ్రేణి ప్లేయర్లు, చెరో 5 గోల్స్ తో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మరి వీళ్లిద్దరిలో ఫైనల్లో ఏ ఆటగాడు గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్తాడో చూడాలి. అల్వారెజ్ ( అర్జెంటీనా), ఒలీవర్ గిరూడ్ (ఫ్రాన్స్ ) చెరో 4 గోల్స్ తో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా, మెస్సి, ఎంబాపె ను దాటి బంగారు బూటు గెలుచుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.