ఓ వ్యక్తి ప్రాణాలను మింగిన పేకాట

ఓ వ్యక్తి ప్రాణాలను మింగిన పేకాట

వరంగల్ టైమ్స్, ఏలూరు జిల్లా : నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువు సమీపంలో పేకాట శిబిరం నుండి పరుగు తీస్తున్న చికెన్ వ్యాపారి షేక్ అబ్బాస్(37) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఉన్నతాధికారుల ఆదేశానుసారం, విశ్వసనీయ సమాచారంతో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పేకాటరాయుళ్లు పరుగు తీయడం ప్రారంభించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగుతీస్తూ గుండెపోటుకు గురయ్యాడు షేక్ అబ్బాస్. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిన షేక్ అబ్బాస్ ను పోలీసులు రక్షించే ప్రయత్నం చేశారు.

ఈక్రమంలోనే పోలీసులు తమ జీపులో షేక్ అబ్బాస్ ను నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని బంధువులు మాత్రం అనేక విధాలుగా ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.