ఠాక్రే ఎంట్రీ అదుర్స్..! 

ఠాక్రే ఎంట్రీ అదుర్స్..!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : అనుకున్నట్లుగానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలంగాణలో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చారు. మాణిక్కం ఠాగూర్ లో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా.. అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో అడుగుపెట్టడం దగ్గర్నుంచి తాను తిరుగు ప్రయాణమయ్యే వరకు అన్ని వర్గాల నేతలను కలిశారు. అందరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

హైదరాబాద్ కు వచ్చీ రాగానే గాంధీ భవన్ లో వరుస భేటీలతో బిజీగా కనిపించారు మాణిక్ రావు ఠాక్రే. రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క లాంటి వారితో భేటీ అయ్యారు. పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై రేవంత్ రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుల అభ్యంతరాలపైనా ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలిసింది. సీనియర్ నాయకుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, ఇక ముందు కలిసి నడుద్దామని రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. గతాన్ని మరిచి, అందరినీ కలుపుకుపోవాలని మాణిక్ రావు ఠాక్రే సూచించినట్లు టాక్.

నేతలతో భేటీల సందర్భంగా మాణిక్ రావు ఠాక్రే తాను అందరివాడినని చెప్పుకోవడానికి గట్టిగానే ప్రయత్నించారట. మహారాష్ట్రలో కఠిన సందర్భాల్లో తాను మంత్రి పదవిలో ఉన్నానని, పార్టీలోనూ కీలకపాత్ర పోషించిన విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఎప్పుడు ఎలా ఉండాలో తనకు తెలుసంటూ తన స్వభావాన్ని చెప్పే ప్రయత్నం చేసినట్లు టాక్. తాను ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో, అవసరమైన సందర్భంలో అంతే కఠినంగానూ వ్యవహరిస్తానని నేతలకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఠాక్రే ఎంట్రీ అదుర్స్..! ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనూ మాణిక్ రావు ఠాక్రే భేటీ అయ్యారు. గాంధీ భవన్ కు కోమటిరెడ్డి రాలేనని చెప్పడంతో ఇద్దరు నేతలు బయట సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డిపై తనకున్న అభ్యంతరాలను ఠాక్రే ద్రుష్టికి కోమటిరెడ్డి తెచ్చినట్లు సమాచారం. పార్టీ పటిష్టత కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమని, కానీ రేవంత్ రెడ్డి వర్గాన్ని కొంత అదుపులో పెట్టాలని కోమటిరెడ్డి కోరినట్లు టాక్. ఈ ప్రతిపాదనకు మాణిక్ రావు కూడా ఓకే చెప్పారట. అన్నీ తాను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు షోకాజ్ లాంటివి ఏమీ లేవు, ముందు పార్టీ కోసం పనిచేయాలని కోమటిరెడ్డికి ఠాక్రే సూచించారట.

ఇక జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కోదండరెడ్డి, వీహెచ్ ఇలా అన్నివర్గాల నాయకులతోనూ ఠాక్రే మీటయ్యారు. అందరికీ ఒక్కటే చెప్పారట. కాంగ్రెస్ పరిస్థితి బాగుపడాలి. అందుకోసం ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పాలంటూ నేతలను కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పరిస్థితిని బాగానే ఉన్నా, నేతల మధ్య అనైక్యత వల్లే గందరగోళం నెలకొంటుందని ఠాక్రే కూడా గ్రహించారట. అందుకే వర్గాలను పక్కనబెట్టి, పార్టీ పటిష్టత కోసం అందరూ పనిచేసేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మాణిక్ రావు ఠాక్రే త్వరలోనే మరోసారి రాష్ట్రానికి వస్తానని చెప్పారట. ఇక అప్పట్నుంచి సీరియస్ ప్రణాళిక మొదలవుతుందని నేతలతో అన్నారట. ఎన్నికల ముంగిట విభేదాలు మానుకుని, పార్టీ కోసం పనిచేయకపోతే గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా తాను వెనుకాడనని అందరికీ స్పష్టం చేసినట్ల తెలుస్తోంది. మొత్తంగా మాణిక్కం ఠాగూర్ లో ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే రకం కాదు. తాను తన టాస్క్ ను కంప్లీట్ చేసే వరకు పోరాటం చేస్తానని మాణిక్ రావు ఠాక్రే అందరికీ సిగ్నల్స్ ఇచ్చారు.

మాణిక్ రావు ఎంట్రీ తర్వాత పరిస్థితి చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ఇంతకుముందులా ఉండకపోవచ్చని హస్తం నేతలు చెబుతున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ కు కొత్త జోష్ వచ్చేలా ఠాక్రే అద్భుతం చేసి తీరుతారని ఆ పార్టీ నేతలు కొండంత ధీమాతో ఉన్నారు. మరి ఠాక్రే నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తారా? లేక తన వల్ల కాదంటూ మిగతా వాళ్లలాగా కాడి వదిలేస్తారా? అన్నది కాలమే తేల్చాలి.