మరోసారి టీబీజేపీ చీఫ్ గా బండి సంజయ్?  

మరోసారి టీబీజేపీ చీఫ్ గా బండి సంజయ్?

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పదవికి ఎలాంటి ఢోకా లేదా? ఆయనను తప్పిస్తారన్న ప్రచారం ఉత్తదేనా? బండి సంజయ్ నాయకత్వంలోనే రాష్ట్ర బీజేపీ ఎన్నికలకు వెళ్తుందా? అంటే ఔననే అంటున్నారు కమలనాథులు.మరోసారి టీబీజేపీ చీఫ్ గా బండి సంజయ్?  * దూకుడే బండి మంత్రం..
బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ తో ఆయన ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యారు. పైగా బీసీ సామాజికవర్గం. అందుకు తగ్గట్టుగానే బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ అయినప్పటి నుంచి దూకుడే మంత్రంగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై ఒంటికాలిపై లేస్తూ మీడియాలోనూ హైలైట్ అయ్యారు. ఇవన్నీ బండి సంజయ్ కి సానుకూల అంశాలే. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్రతో హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేశారు బండి సంజయ్. ప్రధాని మోదీ అయితే బండి పెర్ఫామెన్స్ తో ఫుల్ ఫిదా అయిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ కు ఎప్పటికప్పుడు సంజయ్ కౌంటర్లు ఇచ్చే విధానం మోదీని ఆకట్టుకుందట. గతంలో ఏ అధ్యక్షుడూ ఇలా ముఖ్యమంత్రికి కౌంటర్లివ్వలేదని… బండి సంజయ్ మాత్రం ఎప్పటికప్పుడు గట్టి కౌంటర్లు వేయడాన్ని మోదీ ప్రశంసించినట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అయితే బండి సంజయ్ పై మోదీ ప్రశంసలు కురిపించారు. శెభాష్ బండి జీ అంటూ కితాబిచ్చారు. సంజయ్ మంచి వక్త అని… ఆయన మాట్లాడుతుంటే వెంకయ్య నాయుడు గుర్తుకు వస్తారని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అంతేకాదు బండి సంజయ్ హిందీలో మాట్లాడబోతుంటే.. తెలుగులో మాట్లాడాలని ప్రధాని మోదీ సూచించారు.

*ఇక పదవీగండం లేనట్లే!
బండి సంజయ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడంతో ఒకటి మాత్రం స్పష్టమైపోయింది. బండి సంజయ్ కి పదవీగండం లేదని తేలిపోయిందన్న వాదన వినిపిస్తోంది. ఈటల వంటి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నా.. బండి సంజయ్ కే మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఆ విషయాన్ని హైకమాండ్ ఇప్పటికే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వారికి చెప్పినట్లు తెలుస్తోంది.

*బండితోనే తెలంగాణ బీజేపీలో జోష్!
బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తేనే తెలంగాణ బీజేపీలో జోష్ ఉంటుందని మోదీ భావిస్తున్నారట. అంతేకాకుండా కీలకమైన ఎన్నికల సమయంలో కొత్త వ్యక్తి అయితే కొంత ఇబ్బంది ఉంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోందని టాక్. కొత్త చీఫ్ అయితే కుదురుకోవడానికి కొంత టైమ్ పడుతుంది. కానీ తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే ఎన్నికలు ముంచుకొచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ టైమ్ లో రిస్క్ చేయకుండా దూకుడు మీదున్న బండి సంజయ్ ని కొనసాగించడమే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. బండి కొనసాగింపుపై పార్టీలో పెద్దగా వ్యతిరేకత లేనట్లు సమాచారం. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి నాయకులు కూడా బండి సంజయ్ కే ఓటేసినట్లు టాక్.

*హాట్ డైలాగులు ఫలించేనా!
ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు దక్కడం, తన పదవి కొనసాగింపుపై బండి సంజయ్ కి స్పష్టమైన సంకేతాలున్నాయట. అందుకే ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారట. మరింత దూకుడు పెంచి, వచ్చే ఎన్నికల్లో కమలం సత్తా చాటేలా ప్రణాళికలు రూపొందించే పనిలో బండి సంజయ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ మరింత దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి హాట్ డైలాగులతో ఎన్నికల రణరంగంలోనూ బండి సంజయ్ దూసుకుపోవడం ఖాయమేనంటున్నారు బీజేపీ క్యాడర్.