కరోనా కాటుకు బలవుతున్న కత్తెర బ్రతుకులు

గిరాకీలు లేక వెలవెలబోతున్న మంగలి షాపులు

పూట గడవక, షాపుల అద్దెలు చెల్లించలేక అవస్థలు

స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్న మంగలిషాపుల యజమానులు

 రూ.20వేలు అందించి ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం

లేదంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్న మంగలన్నలు

వరంగల్ : రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు. ఇప్పటికే కార్పోరేట్ వ్యవస్థతో అతలాకుతలం అయిన మంగలి షాపుల దుస్థితి లాక్ డౌన్ నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారయ్యింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను మట్టునపెట్టేందుకు యావత్ ప్రపంచం లాక్ డౌన్ విధించింది. తెలంగాణలోనూ రెండున్నర నెలలపాటు లాక్ డౌన్ కొనసాగింది. అయితే కరోనాతో సావాసం తప్పదు, ఎవరికి వారే రక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం లాక్ డౌన్ ను ఎత్తివేసింది. దీంతో సంబరపడిపోయిన నాయీబ్రాహ్మణులు మళ్ళీ లాక్ డౌన్ దుస్థితినే ఎదుర్కొంటున్నారు. మంగలి షాపులు తెరిచివుంచినా ,రోజంతా ఒక్క గిరాకీ రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ వాడుతూ, నోటికి మాస్కులు , చేతులకు గ్లౌసులు ధరించినా, షాపంతా శానిటైజ్ చేసుకున్నా కరోనా భయంతో ఒక్క గిరాకీ రాక పొద్దంతా ఎదురుచూసి , ఎదురుచూసి మంగలన్నలు ఇంటిముఖం పడుతున్నారు. దీంతో ఇంట్లో పూట గడవక, షాపుల యజమానులకు అద్దెలు చెల్లించలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నాయీ సోదరులు నరకయాతన పడుతున్నారు. కరోనా కాటుకు దుర్భరస్థితిలో కొట్టుమిట్టాడుతున్న కులవృత్తి తప్ప మరో పని చేసుకునేది ఏమీ లేక వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్ పరిధిలోని పలు మంగలి షాపుల యజమానులూ స్వచ్ఛంధంగా మళ్ళీ లాక్ డౌన్ విధించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతీ మంగలి కుల వృత్తిదారులకు 20వేల రూపాయల ఆర్ధికసాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఆత్మహత్యలే తప్ప మరోటి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.