వరంగల్ అర్బన్: వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి ఆలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను వరంగ ల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ యేటా ఎంతో వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య జరిగే శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు కరోనా వైరస్ ప్రభావంతో కొంత భక్తుల రద్దీ తగ్గినా శాస్త్రోక్తంగా అమ్మవారికి నిత్యారాధన జరుగుతుంది. శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అయితే శాకంబరీ నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భక్తులకు సూచించారు. కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు ఆలయ అధికారులు సూచించిన నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పదిహేను రోజుల పాటు కొనసాగే శాకంబరీ నవరాత్రి ఉత్సవాలకు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. ప్రతీ రోజు అమ్మవారికి నిత్యారాధన వుంటుందని పేర్కొన్నారు.