కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలి

కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలిబెంగళూరు : కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడిపోయింది. 20 జిల్లాల్లో 58 అర్బన్ లోకల్ బాడీలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,184 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 501 స్థానాల్లో విజయం సాధించింది.

బీజేపీ 433 స్థానాలకే పరిమితం కాగా, జేడీఎస్ 45 స్థానాల్లో గెలుపొందినట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరో 205 స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్థులతో పాటు చిన్న పార్టీలకు చెందినవారున్నారు. 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఈ ఎన్నికలు చిహ్నం అని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.