తెరాస ఎమ్మెల్యేలకు ఎర..నలుగురు అరెస్ట్

తెరాస ఎమ్మెల్యేలకు ఎర..నలుగురు అరెస్ట్

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు.. డబ్బు కట్టలతో పట్టుబడిన నలుగురు వ్యక్తులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. వీరంతా నగర శివారులోని ఫామ్‌హౌస్‌లో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దిల్లీ, తిరుపతి, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో నోట్ల కట్టలతో పట్టుబడటం తెలంగాణలో కలకలం రేపింది. తెరాస ఎమ్మెల్యేలకు ఎర..నలుగురు అరెస్ట్మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెరాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించినట్టు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. రెండ్రోజులుగా ఈ నలుగురూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించారు.

మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అజీజ్ నగర్​లోని ఓ ఫామ్ హౌస్​లో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరితో పాటు రూ.కోట్లలో నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మెయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ వద్దకు చేరుకుని పరిశీలించారు. నోట్ల కట్టలతో పట్టుబడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారు? డబ్బు ఎవరు సమకూర్చారు? ఇందులో సూత్రధారులెవరు? అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.