“బీఆర్ఎస్” కొంపముంచిన మాస్టర్ ప్లాన్!!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇష్యూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. మాస్టర్ ప్లాన్ లో భూమిపోతుందన్న భయంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కాస్త కామారెడ్డి కేంద్రంగా రాజకీయ అలజడిని సృష్టించినట్లైంది. నిజానికి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై కామారెడ్డి రైతులు నెలరోజులుగా ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని లైట్ తీసుకుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పరిస్థితి తీవ్రతను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఆందోళనలు మామూలేకదా అనుకున్నారో లేక వాస్తవ పరిస్థితిని చెప్పేవారు లేకపోవడం వల్లో కానీ బీఆర్ఎస్ అధిష్టానం ఈ ఇష్యూను అంతగా పట్టించుకోలేదు. కానీ రైతు ఆత్మహత్యతో పరిస్థితి అంతా తలకిందులైంది. అన్నదాత ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత రైతులంతా ఆగ్రహంతో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టడం, అక్కడికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రావడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. పోనీ అప్పుడైనా కలెక్టర్ కు సరైన గైడెన్స్ ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతలో కొంతైనా తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అలా చేయడంలోనూ బీఆర్ఎస్ అధిష్టానం సహా జిల్లా ఎమ్మెల్యేలంతా ఫెయిలయ్యారు. కలెక్టరేట్ ఎదుట రైతులంతా బైఠాయించినా కలెక్టర్ జితేష్ పాటిల్ మాత్రం బయటకు రాలేదు. కలెక్టర్ రావాలని అన్నదాతలు డిమాండ్ చేసినా ఆయన పట్టించుకోలేదు.
చివరకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగితే కానీ కలెక్టర్ సారుకు వాస్తవం బోధపడలేదు. కలెక్టర్, ఉన్నతాధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించారు కలెక్టర్ పాటిల్. ఇది ముసాయిదా మాత్రమేనని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. బీఆర్ఎస్ కు, కేసీఆర్ సర్కారుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతులు శుక్రవారం బంద్ కు పిలుపునివ్వడం. దానికి బీజేపీ, కాంగ్రెస్ మద్దతు పలకడంతో కామారెడ్డిలో పరిస్థితి అదుపుతప్పింది. ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
శుక్రవారం ఉదయం నుంచే రైతుల ఆందోళనలు మిన్నంటాయి. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డిలో ధర్నా చేపట్టారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు బీజేపీ శ్రేణులు కూడా ధర్నాకు దిగాయి. ఇంకేముంది ధర్నాలు, అరెస్టులతో పరిస్థితి వేడెక్కింది. చివరకు సాయంత్రానికి బండి సంజయ్ కామారెడ్డికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసే వరకు ఉద్యమబాట వీడేది లేదని తేల్చి చెప్పారు.
ఈ మొత్తం ఇష్యూలో బీఆర్ఎస్ స్వయంగా బీజేపీ, కాంగ్రెస్ చేతికి కత్తి ఇచ్చినట్లైంది. ఎందుకంటే కామారెడ్డిలో బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు లేరు. అంతా గులాబీ పార్టీకి చెందిన వారే. కామారెడ్డి జిల్లాలో రైతులు బలీయమైన శక్తిగా ఉన్నారు. అలాంటి చోట రైతు ఆత్మహత్యను లైట్ తీసుకోవడం ముమ్మాటికీ బీఆర్ఎస్ తప్పే. అసలే బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఎంపీ అరవింద్ లాంటి వారు దూకుడు మీద ఉన్నారు. నేనున్నాంటూ రేవంత్ రెడ్డి లాంటి వారు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ టైమ్ లో అది కూడా రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాలో ఇలాంటి పరిణామాలు కచ్చితంగా బీఆర్ఎస్ కు నష్టం చేకూరుస్తాయి.
కామారెడ్డిలో రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు. రాజకీయం రోజుకో టర్నింగ్ ఇచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని రోజుల వరకు రైతు కుటుంబానికి పరామర్శల పేరుతో ప్రతీరోజూ పలు పార్టీల నాయకులు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చిన నాయకులు కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడం ఖాయం. ఇదంతా బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేస్తాయనడంలోని అతిశయోక్తి లేదు.. !! ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవం గ్రహించాలి. అసలే జాతీయ రాజకీయాలంటూ సీఎం కేసీఆర్ వేగం పెంచారు. రైతు ప్రభుత్వమంటూ ఇతర రాష్ట్రాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో కామారెడ్డి జిల్లాలో ఇలాంటి పరిణామాలు బీఆర్ఎస్ కు నష్టం చేకూర్చేవే. కాబట్టి బీఆర్ఎస్ అధిష్టానం పరిస్థితి తీవ్రతను గ్రహించాలి. నేతలకు సరైన సూచనలు ఇవ్వాలి. ఇలాంటి తప్పులు రాష్ట్రంలో మరోచోట పునరావృతం కాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.!!