జీవోను వెనక్కి తీసుకోవాలి

జీవోను వెనక్కి తీసుకోవాలినిజామాబాద్​ : గల్ఫ్​ కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో బుధవారం గల్ప్ కార్మిక సంఘాలతో సమావేశమైన ఎమ్మెల్సీ కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉన్న ఊరు, కుటుంబ సభ్యులను వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టపడే కార్మికులకు కేంద్రం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో పూర్తిగా అన్యాయం జరుగుతుందని‌ అందోళన వ్యక్తం చేశారు. ఖతార్, బహ్రెయిన్, ఓమాన్, యూఎఈ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను 200 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 15 వేలు), కువైట్ (245 డాలర్లు), సౌదీ అరేబియా (324 డాలర్లు) కు తగ్గిస్తూ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓవర్సీస్ ఎంప్లాయీమెంట్ అండ్ ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రంట్స్ డివిజన్ లోని డైరెక్టర్ స్థాయి అధికారి రాజ్ కుమార్ సింగ్ పేరిట సెప్టెంబర్ 8న, 21న సర్కులర్లు జారీ అయ్యాయన్నారు. దీనిపై స్పందిస్తూ గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. వలస కార్మికుల సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాడుతామని, ఉత్తర్వులు వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇదే అంశాన్ని త్వరలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని కవిత పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాల్లో‌ గల్ఫ్ కార్మికుల రక్షణకు అద్భుతమైన చట్టాలు ఉన్నాయన్నారు. ఇదే అంశాన్ని గతంలో దివంగత, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నర్సింహనాయుడు, పలువురు గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.