సీజనల్ వ్యాధులను తరిమి వేద్దాం: కమిషనర్ పమేలాసత్పతి

వరంగల్ అర్బన్ జిల్లా: పరిశుభ్రతను పాటిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారిద్దామని బల్దియా కమిషనర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 47వ డివిజన్ కార్పొరేటర్ నల్ల స్వరూపరాణి అధ్యక్షతన బంజారా కాలనీ వీధులల్లో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల సమయాన్ని వెచ్చించడం వల్ల సీజనల్ వ్యాధులను తరిమి వేయవచ్చని అన్నారు. 47వ డివిజన్ లోని ఇంటింటికి వెళ్లి సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలను, పరిశుభ్రతను పాటించాలని పమేలా సత్పతి వివరించారు. దీనిపై ప్రజలకు, గృహిణులకు అవగాహన కల్పిస్తూ బల్దియాచే ముద్రించిన కరపత్రాలను, స్టిక్కర్ లను పంపిణీ చేశారు. ప్రజలు సామాజిక బాధ్యతగా ప్రతి వారం 10 నిమిషాలు కేటాయించి రోగాలు దరిచేరకుండా తమతో పాటు తమ కుటుంబ ఆరోగాన్ని కాపాడుకోవాలన్నారు.సీజనల్ వ్యాధులను తరిమి వేద్దాం: కమిషనర్ పమేలాసత్పతిఎవరి ఇళ్లల్లో వారు నీరు నిల్వ ఉండే ప్రాంతాలైన ఎయిర్ కూలర్లు, నీటి తొట్టెలు, పూల తొట్టిలు, గాజు సీసాలు, మెటల్ సామాన్లు, రబ్బర్ టైర్లు ఇతర నీరు నిల్వ ఉండే ప్రతి వస్తువును శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కువ రోజుల పాటు నీరు నిల్వ ఉండడం వల్ల క్రిమికీటకాలు పెరిగి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందువల్ల నిలువ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణ, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో నే కాకుండా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటీని తొలగించాలని బల్దియా కమిషనర్ పమేలా సత్పతి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నల్ల స్వరూపరాణి , బల్దియా ఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, డివిజన్ వాసులు , తదితరులు పాల్గొన్నారు.