కరోనా పంజా.. వాయిదా పడిన రంజీ ట్రోఫీ

కరోనా పంజా.. వాయిదా పడిన రంజీ ట్రోఫీన్యూఢిల్లీ : క్రికెట్ టోర్నీలపై కరోనా పంజా విసురుతున్నది. రోజురోజుకు కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశవాళీ టోర్నీలైన ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ సహా కర్నల్ సీకే నాయుడు టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

రంజీ ట్రోఫీకి సిద్ధమవుతున్న బెంగాల్ జట్టులో ఐదుగురు ప్లేయర్లుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ముంబై ఆలౌండర్ శివమ్ దూబే, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అభిషేక్ దాల్మియా కొవిడ్-19 బారిన పడటంతో బోర్డు ముందస్తు జాగ్రత్తలకు దిగింది.ఈ నేపథ్యంలో జైషా స్పందించారు. ‘ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాం.

షెడ్యూల్ ప్రకారం రంజీ ట్రోఫీ, నాయుడు టోర్నీలు ఈ నెలలో , మహిళల సీనియర్ టీ 20 టోర్నీ ఫిబ్రవరిలో మొదలు కావాల్సి ఉంది. కానీ కరోనా ఉధృతి పెరుగుతున్న క్రమంలో టోర్నీలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారుల ఆరోగ్యం విషయంలో బీసీసీఐ రాజీపడదు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక టోర్నీలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ప్రకటిస్తాం ‘ అని జైషా అన్నాడు.