కరోనా వైరస్ సోకిన వారిలో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇచ్చారు. కోవిడ్19 వల్ల నాడీ సంబంధిత రుగ్మతలు డెవలప్ అయ్యే ప్రమాదం ఉందన్నారు.
నరాల్లో వాపు రావడం, సైకోసిస్, డెలీరియం లాంటి వ్యాధులు కూడా వైరస్ వల్ల పట్టి పీడించే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్) పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. దాదాపు 43 కేసులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. వారిలో మెదడు సంబంధిత సమస్యలను గుర్తించారు.స్ట్రోక్స్, నరాలు దెబ్బతినడం, మెదడుపై ప్రభావాన్ని పసికట్టారు. కోవిడ్19 వల్ల మనిషి మెదడు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. 1918లో వచ్చిన ఫ్లూ మహమ్మారి తర్వాత కూడా 1920, 30 దశకాల్లో మెదడువాపు వ్యాధి ప్రబలినట్లు యూసీఎల్ న్యూరాలజీ ఇన్స్‌టిట్యూట్ పరిశోధకుడు మైఖేల్ జాండీ తెలిపారు. వాస్తవానికి కోవిడ్19 ఎక్కువ శాతం ఊపిరితిత్తుల సంబంధిత రుగ్మతలకు దారి తీస్తుంది. అయితే తాజా కేసులను పరిశీలిస్తున్న డాక్టర్లు.. ఆ వ్యాధితో బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరిగే ప్రమాదం ఉందన్న నిర్ధారణకు వచ్చారు. ఒకవేళ ఒక ఏడాదిలో పది మిలియన్ల మంది వైరస్ నుంచి కోలుకున్నా.. వారిలో మెదడు సంబంధింత లోపాలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు కెనడా న్యూరోసైంటిస్ట్ ఆడ్రియన్ ఓవెన్ తెలిపారు.