దగ్గుబాటి రానా, సురేష్ బాబుపై క్రిమినల్ కేసు 

దగ్గుబాటి రానా, సురేష్ బాబుపై క్రిమినల్ కేసు 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఫిలింనగర్ స్థలం వివాదం మరో మలుపు తిరిగింది.ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాలి సురేష్ బాబు, ఆయన కుమారుడు సినీ నటుడు రానాపై కేసు నమోదైంది. వీరిద్దరిపై నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఐతే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మేందుకు తమ వద్ద డబ్బులు తీసుకుని, రిజిస్ట్రేషన్ చేయడం లేదని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ముందుగా పోలీసులను ఆశ్రయించారు.

ఐతే బంజారాహిల్స్ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దానిని కాగ్నిజెన్స్ గా తీసుకుంది కోర్టు. సురేష్ బాబు, రానా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని జనవరి 19న సమన్లు జారీ చేసింది. మే 1 కి తదుపరి విచారణను వాయిదా వేసింది.

షేక్ పేట మండలం సర్వే నెం.403లో సినీ నటి మాధవికి చెందిన 1007 గజాలను సురేష్ బాబు కొన్నారు. ఆ ప్రాపర్టీని 2014లో ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికి హోటల్ ఏర్పాటు కోసం లీజుకిచ్చారు. 2018 ఫిబ్రవరిలో ఫీజు ముగుస్తుండగా ప్లాట్ నెం.2లోని స్థలాన్ని రూ. 18 కోట్లకు అమ్మేందుకు సురేష్ బాబు అంగీకరించారు. ఈ క్రమంలో ప్రమోద్ కుమార్ రూ.5 కోట్లు చెల్లించాడు. దీనికి సంబంధించి డీడ్ కుదుర్చుకున్నారు.

ఆ తర్వాత లీజు గడువు ముగిసింది. అయినప్పటికీ ఖాళీ చేయడం లేదంటూ ప్రమోద్ పై ఓ కేసు వేశారు. వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపిచారు. అయితే తన వద్ద రూ. 5 కోట్లు అడ్వాన్స్ గా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయడం లేదని ప్రమోద్ కూడా కోర్టు ఆశ్రయించాడు. ఈ వ్యవహారంపై యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అవి తేలకముందే, గత సంవత్సరం ఆ స్థలాన్ని సురేష్ బాబు తన కుమారుడు రానాకు విక్రయించారు.

ఈ నేపథ్యంలోనే నవంబర్ 1న రానా పేరు చెప్పి కొందరు వ్యక్తులు, ఆ స్థలంలోని సెక్యూరిటీ సిబ్బందిని తరిమివేశారు. ఖాళీ చేయాలని ప్రమోద్ ను బెదిరించారు. అదే రోజున ప్రమోద్ బంజారాహిల్స్ పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో నాంపల్లిలోని 3వ అదనపు చీఫ్ మెట్రో పాటిటన్ మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు. వారు చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే రానా, సురేష్ బాబుకు సమన్లు పంపించింది.