జాతకంలో కాలసర్పదోషం ఉంటే..ఏం చేయాలి ?
వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : కొంతమంది చాలా కష్టపడి పనిచేస్తుంటారు. అయినా కూడా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఏ పని చేపట్టినా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఏ పనికూడా పూర్తవ్వదు. అనుకున్న దానిలో విజయం సాధించలేరు. దీనంతటికి కారణం నవగ్రహదోషాలు అంటుంటారు. అయితే జాతకంలో కాల్పసర్ప దోషం ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు ఎదురవుతుంటాయి. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి వంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతాయి. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలసర్పదోషం ఉన్నవారికి వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
*జాతకంలో కాల సర్ప దోషాలు .. వాటి ప్రభావాలు :
-వంధ్యత్వం
-మానసిక ఒత్తిడి
-కుటుంబ కలహాలు
-లవ్ ఫెయిల్యూర్స్
-పెళ్లి కాకపోవడం
-రోడ్డు ప్రమాదాలు
-వ్యాపారంలో నష్టాలు
-ప్రతికూల ఆలోచనలు
-వైవాహిక జీవితంలో ఒత్తిడి
-ప్రతి పనిలో ఆటంకం
-మద్యం, జూదానికి అలవాటు పడటం
-పదే పదే ఉద్యోగంలో మార్పు, తొలగింపు
– డబ్బు నిల్వ ఉండకపోవడం,అప్పుల బాధ
-నిద్రలో నల్ల పాము లేదా పాముని చూడటం
-కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడం
*పరిహారం ఏం చేయాలి తెలుసుకుందాం :
*శివున్ని పూజించాలి :
జాతకంలో నాగదోషం తొలగిపోవాలంటే శివున్ని పూజించాలి. ప్రతీ సోమవారం రుద్రాభిషేకం చేయాలి. శివలింగానికి నీరు సమర్పించాలి. ఇలా ప్రతీ రోజూ చేయడం వల్ల జాతకంలో ఉన్న కాలసర్పదోషం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణమాసంలో రుద్రాభిషేకం చేయడం వల్ల అనుకున్న పనులన్నీ జరుగుతాయి.
*శివునికి వెండి పాములను సమర్పించడం :
సోమవారంనాడు శివునికి వెండి జత పాములను సమర్పించండి. ఈ పరిహారంతో మీ జాతకంలో ఉన్న సర్పదోషం తొలగిపోతుంది. దీంతో పాటు శివుడు మీ జీవితంలో అన్ని సమస్యల నుంచి విముక్తి కలిగేలా చూస్తాడు.
*మట్టితో చేసిన శివలింగాన్ని పూజించండి :
వీలైతే మట్టితో శివలింగాన్ని తయారు చేసి నిత్యం పూజించండి. మీరు శివలింగాన్ని తయారు చేయలేనట్లయితే..మహామృత్యుంజయ మంత్రాన్ని 1100 సార్లు జపించండి. ఈ పరిహారం జాతకం నుండి కాల సర్ప్ దోషాన్ని కూడా తొలగిస్తుంది.
*రాహు-కేతు మంత్రాలను జపించండి :
రాహు, కేతువుల బీజ మంత్రాలను 1.25 లక్షల సార్లు జపించండి. రాహువు బీజ మంత్రం -‘ఓం రా రాహవే నమః’, కేతువు, బీజ మంత్రం – ‘ఓం స్రాన్ శ్రీన్ శ్రౌన్ : కేత్వే నమః’. ఈ మంత్రాలను పఠించడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి.
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇవి పాటించడం కష్టతరమైతే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం రాహు, కేతు పూజ పెట్టించుకుంటే జాతకంలోని కుండలిలో కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుంది. మళ్లీ పదే పదే ఇలాంటి సమస్యలు ఎదురైతే ప్రతీ యేడాదికొకసారి ఈ దోష నివారణ కోసం పూజలు చేయించుకోవాలి. ఇంకా మీకు ఓపిక ఉంటే మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న త్రయంబుకేశ్వరాలయానికి వెళ్లాల్సిందే. త్రయంబుకేశ్వరాలయంలో కాలసర్పదోష నివారణ పూజ మూడు రోజుల పాటు జరిపిస్తారు. కాలసర్పదోషం, నారాయణ నాగ్ బలి, కుజ దోషం నివారణకు నాసిక్ త్రయంబుకేశ్వరాలయం ఫేమస్. కాబట్టి కాలసర్ప దోషం ఉన్న వారెవరైనా ఇక్కడ మూడురోజుల పాటు పూజ చేయించుకుంటే దోష ప్రభావం అధిక మొత్తంలో తగ్గుతుంది.
*త్రయంబుకేశ్వరాలయం పూజ వివరాలు :
ఇక్కడ పూజారులకు ఫీజు చెల్లిస్తే 3 రోజులకు సరిపడా పూజా సామాగ్రి, కొత్త దుస్తులతో పాటు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారు.పూజకు ఒక రోజు ముందు త్రయంబుకేశ్వరం చేరుకుని, ఆన్లైన్ లో ఏ పూజారినైతే ఎంచుకున్నామో, ఆ పూజారి కార్యాలయానికి పూజకు ఒక రోజు ముందే చేరుకోవాలి.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఈ పూజ నిర్వహిస్తారు. ఈ పూజలో పాల్గొనే వారు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసంతో ఉండాలి. పూజ జరుగుతున్న మూడ్రోజుల పాటు ఎవరినీ తాకకుండా నిష్టగా ఉండాలి. పూజ అనంతరం పూజారులు ఇచ్చిన కొబ్బరి ప్రసాదాన్ని, ఇంటికి చేరుకున్నాక కొబ్బరిని బెల్లంతో కలిపి నైవేద్యం చేసుకోవాలి. పూజలో పాల్గొన్నవారు ఈ నైవేద్యాన్ని తినాలి. దీంతో పాటు పూజ అనంతరం 41 రోజుల పాటు మద్యపానం,ధూమపానం, మాంసానికి దూరంగా ఉండాలి. ఈ మండల దీక్షను పాటించకపోతే పూజా ఫలితం దక్కదు. మళ్లీ అవే సమస్యలు రిపీట్ అవుతాయి. కాలసర్పదోష ప్రభావం ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. కావున పై నియమాలు సక్రమంగా పాటిస్తే, జాతక కుండలిలో కాలసర్ప దోషం ఉన్నా , దాని ప్రభావం తగ్గి, సుఖమైన జీవితాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
నోట్ :
మీ పుట్టిన తేది గుడ్డిగా రాసుకున్నది కాకుండా, మెడికల్ సర్టిఫికెట్ ఉన్నవారు నిష్ణార్ధులైన జ్యోతిష్యులను సంప్రదించండి. మీ జాతక కుండలిలో కాలసర్ప దోషం నిర్ధారణ అయితేనే పై రెమిడీస్ పాటించండి.