ప్రసిద్ధి చెందిన 3 శివాలయాల గురించి తెలుసా ?

ప్రసిద్ధి చెందిన 3 శివాలయాల గురించి తెలుసా ?

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : హిందూమతంలో దేవుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలో కోటానుకోట్ల దేవతలు ఉన్నారు. వారందర్నీ హిందువులు పూజిస్తారు. మనం పూజించే దేవుళ్లందరిలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చాలా ముఖ్యమైనవారు. ఈ ముగ్గురిలో శివుడు చాలా మంది భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడు. అందుకే అత్యధిక సంఖ్యలో భక్తులు ఉన్న దేవుడు శివుడు. దేశంలో ఎక్కడికి వెళ్లినా కనీసం ఒక్క శివాలయమైన ఉంటుంది. పరమశివుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందడమే కాదు, గొప్ప మహిమాన్వితుడు కూడా. శివునికి అంకితం చేయబడిన వేలాది ఆలయాలలో ఈ మూడు ఆలయాలు అత్యంత ప్రసిద్ధమైనవి. ఆ మూడు ఆలయాలేంటో చూద్దాం.

ప్రసిద్ధి చెందిన 3 శివాలయాల గురించి తెలుసా ?

* కేదార్‌నాథ్ ఆలయం :
ఉత్తరాఖండ్‌ గర్వాల్‌లోని హిమాలయాలలో మందాకిని నదికి సమీపంలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయం 3562 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేస్తే చాలా మంచిది. ఈ చార్ ధామ్ యాత్రలలో కేదార్‌నాథ్ క్షేత్రం ఒకటి. శివపురాణం ప్రకారం, కేదార్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించడం మరణానంతరం మోక్షానికి దారితీస్తుందని చెబుతుంటారు. ద్వాపర యుగంలో పాండవులు మహాభారత యుద్ధంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుడిని వెతుకుతూ కేదార్‌నాథ్‌ను సందర్శించారని పురాణాలు చెబుతున్నాయి.

* సోమనాథ్ ఆలయం :
గుజరాత్‌లోని వెరావల్‌లో ఉన్న సోమనాథ్ ఆలయం మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పవిత్ర ప్రదేశం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా కూడా పరిగణిస్తారు. విశ్వాసాల ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రదేవుడు స్థాపించాడని చెబుతారు. దక్ష మహారాజు తన అల్లుడు చంద్రుడిని శపించినప్పుడు, చంద్రదేవుడు దాని నుండి బయటపడటానికి ఈ ప్రదేశంలో శివుడిని పూజించాడు. అనేక పురాణాలలో ఈ ఆలయ మహిమ గురించి తెలుసుకోవచ్చు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించడం వల్ల భక్తులకు ఉన్న కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

* దేవఘర్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం :
శివుడు, శక్తి కలిసి ఉండే ఏకైక ప్రదేశం జార్ఖండ్‌లోని డియోఘర్‌లోని ఈ బాబా బైద్యనాథ్ ఆలయం. శివునికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం కూడా ఒకటి. బాబా బైద్యనాథ్ ధామ్ మహిమలు అనేక గ్రంథాలలో పేర్కొన్నారు. ఆలయంలోని ఈ జ్యోతిర్లింగాన్ని హవిస్సును తీర్చే లింగంగా పిలుస్తారు. నిజమైన భక్తి, అంకితభావంతో కోరికలు కోరితే ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతాయని నమ్ముతారు. శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు 105 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ భోలేనాథ్‌కు జలాభిషేకం చేసేందుకు ఇక్కడికి వస్తారు.

Note : పేర్కొన్న 3 శివాలయాలను మానవ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి.