మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో ఊరట

మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో ఊరట

ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ

మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో ఊరట

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి పి.నారాయణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బెయిల్‌ రద్దు చేయాలన్న ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గత ఏడాది ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది. వాట్సాప్‌ ద్వారా తెలుగు ప్రశ్నాపత్రం బయటకు రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు వెల్లడించారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే నారాయణ వైదొలిగారంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై గత కొన్ని నెలలుగా జిల్లా కోర్టు, హైకోర్టుల్లోనూ విచారణ జరిగింది. ఇటీవల నారాయణ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.

హైకోర్టు ఆదేశాలపై స్టే..
సుప్రీంకోర్టులో టీడీపీ మాజీ మంత్రి పి.నారాయణకు ఊరట లభించింది. జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురైంది. పేపర్ లీకేజ్ కేసులో హైకోర్టు రిమాండ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జగన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. పి.నారాయణ తరపున కోర్టులో సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూద్రా, గుంటూరు ప్రమోద్, గుంటూరు ప్రేరణ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు రవీంద్రభట్, దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించింది. గతంలో నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టు మాజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. హైకోర్టు బెయిల్ రద్దు చేసి నారాయణను సరెండర్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు నేడు స్టే ఇచ్చింది.

అసలేం జరిగిందంటే : గత ఏడాది ఏప్రిల్‌ – మే నెలలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సందర్భంగా ప్రశ్నా పత్రాలు లీక్ కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నారాయణను అరెస్టు చేసిన పోలీసులు చిత్తూరు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్‌ను తిరస్కరించడంతో నారాయణ బెయిల్‌పై విడుదలయ్యారు. దీనిపై పోలీసులు సెషన్స్‌ కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణానంతరం సెషన్స్‌ కోర్టు నారాయణకు బెయిల్‌ ఉత్తర్వులను రద్దు చేసి ఆయన కోర్టులో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది.