వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు

వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులువరంగల్ రూరల్ జిల్లా: ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు నిరసన గళం వినిపిస్తున్నాయి. రైతులు, కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా రైతులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపాయి, రోడ్లు దిగ్భంధం చేసి రాస్తారోకో చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు రాజకీయ పార్టీల నాయకులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఇదిలా వుండగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం వల్లభ్ నగర్ లో ఇద్దరు రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సన్న వడ్లు పండించాలని చెప్పి, పండించిన సన్న వడ్లకు మద్దతు ధర కల్పించే నాధుడే లేరు, వాటిని కొనే నాథులే లేరంటూ నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు నిరసన తెలుపుతున్న బాధిత రైతులను వాటర్ ట్యాంక్ పై నుంచి దింపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ససేమిరా అన్న బాధిత రైతులు ప్రభుత్వం దిగివచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు నిరసన కొనసాగిస్తాంటూ హెచ్చరించారు.