మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు పూర్తి

మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు పూర్తిహైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం కొంపల్లిలోని ఫాంహౌజ్ లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పార్టీలకతీతంగా రోశయ్య అంత్యక్రియలకు భారీగా ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్ హాజరయ్యారు.

అంతకు ముందు గాంధీభవన్ లో కొద్ది సేపు రోశయ్య పార్థీవ దేహాన్ని ఉంచగా, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొంపల్లిలోని ఫాంహౌస్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు.

మాజీ సీఎం రోశయ్య మృతికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లవెత్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ , ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు, తమిళనాడు సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, హీరో మెగాస్టార్ చిరంజీవి పలువురు రోశయ్య మృతికి సంతాపం తెలిపారు.