కంపెనీల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా

కంపెనీల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లావరంగల్ జిల్లా : దేశానికే తలమానికంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పరిశ్రమలో టి.ఎస్.ఐ. ఐ. సి.అధికారులతో కలిసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, కంపెనీల ఏర్పాటు పనులను పరిశీలించారు. పర్యటనలో భాగంగా పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, నూతనంగా ఏర్పాటు అవుతున్న కంపెనీల పనుల పురోగతిని పరిశీలించారు.

అధికారులను పరిశ్రమకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభమయ్యే కంపెనీలు ఏవేవో కనుక్కున్నారు. కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో గణేష ఈకో పెట్ కంపెనీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. కాకతీయ వస్త్ర పరిశ్రమ ద్వారా ప్రజలకు ఉపాధి లభిచనుందని తెలిపారు. ఈ కంపెనీలు ప్రారంభమయ్యాక 4 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.కంపెనీల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లాయువ నాయకుడు, మంత్రి కేటీఆర్ చొరవతో పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో ఏర్పాటవుతున్నాయని చల్లా ధర్మారెడ్డి అన్నారు. 2022 చివరిలోగా కైటెక్స్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రెండు నెలల్లో గణేష ఈకో పెట్ కంపెనీ ప్రారంభించుకోనున్నట్లు చల్లా ధర్మారెడ్డి తెలిపారు. బతుకుదెరువు కోసం వేరే దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే ఉపాధి పొందేలా, వారిని ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు.

ఇక రాజకీయ లబ్ధికోసం నిత్యం విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం ప్రజాసమస్యలపై అవగాహన లేదని ఎమ్మెల్యే చల్లా ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే చల్లా సూచించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాలను అభివృద్ధిలో ముందంజలో ఉంచాలన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల కృషి ఎనలేనిదని చల్లా ధర్మారెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు.