గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. వచ్చే జూన్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెల్పింది. జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది. అందులో ఫిబ్రవరి 11 ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టీఎస్పీఎస్సీ తెల్పింది. జనరల్ ఇంగ్లీష్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషల్లో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది.
కాగా, గత యేడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే గ్రూప్-1 ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేసుకుంది. అంటే ప్రిలిమ్స్ కు హాజరైన వారి నుంచి 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసింది.
టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకారం జూన్ 5న జనరల్ ఇంగ్లీష్ ( అర్హత పరీక్ష), జూన్ 6న జనరల్ ఎస్సే (పేపర్-1), జూన్ 7న హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ( పేపర్-2), జూన్ 8న ఇండియన్ సొసైటీ, కాన్ స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ (పేపర్-3), జూన్ 9న ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ( పేపర్-4), జూన్ 10న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ ప్రిటేషన్ (పేపర్-5), జూన్ 12న తెలంగాణ ఉద్యమం అండ్ రాష్ట్ర ఆవిర్భావం(పేపర్-6) అంశాలపై పరీక్షలు జరుగనున్నాయి.