చెన్నై: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మంది కన్నుమూశారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆయనే గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. తీవ్రంగా గాయపడిన ఆయన వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వరుణ్ సింగ్ ఇండియన్ ఆర్మీలో ఆయన విశేష సేవలందించారు. ఈ ఏడాది ఆగస్టులోనే భారత ప్రభుత్వం వరుణ్ సింగ్‌ను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది.
గతేడాది తాను నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ.. ధైర్య సాహసాలు, నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్ చేశారు.